కేంద్రం ఇవ్వదు...రాష్ట్రం అడగదు: జానారెడ్డి

June 16, 2018


img

సిఎల్పి నేత కె జానారెడ్డి శనివారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రానికి ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా కేంద్రం నెరవేర్చలేదు. అయినా తెరాస సర్కార్ కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేదు. చూస్తుండగానే నాలుగేళ్ళు గడిచిపోయాయి. హైకోర్టు విభజన, బయ్యారం ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, గిరిజన, ఉద్యానవన యూనివర్సిటీల స్థాపన ఏ ఒక్క హామీ అమలుకాలేదు. ‘కేంద్రం ఇవ్వదు...రాష్ట్రం అడగదు’ అన్నట్లుంది పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికీ విభజన హామీలను అమలుచేయాలనే ఆసక్తి కనిపించడం లేదు. ఇక ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. దాని పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలియదు. నిన్న సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్రమోడీని కలిసారు. కానీ రాష్ట్రానికి ఏమి సాధించుకొచ్చారో తెలియదు. ఈవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రాజకీయ ప్రదర్శనలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నాయి,” అని విమర్శించారు. 

సిఎం కెసిఆర్ తో సహా రాష్ట్ర మంత్రులు, తెరాస ఎంపిలు, రాష్ట్ర ఉన్నతాధికారులు అందరూ విభజన హామీలను అమలుచేయాలని గత నాలుగేళ్ళుగా కేంద్రంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారనే సంగతి జానారెడ్డితో సహా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కనుక తెరాస సర్కార్ ప్రయత్నలోపం ఏమీ లేదని చెప్పవచ్చు. తెరాస సర్కార్ ఇంతగా ఒత్తిడి తెచ్చినా కేంద్రం విభజన హామీలను అమలుచేయలేదు. కనుక వాటికి దానినే నిందించకతప్పదు. 

అయితే కాంగ్రెస్ పార్టీ మోడీ సర్కార్ ను నిందించినా వాటిని రాష్ట్ర ప్రజలు పెద్దగా పట్టించుకోరు. అదే తెరాస సర్కార్ ను నిందించినట్లయితే ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు. కాంగ్రెస్ వాదనలను ప్రజలు నమ్మితే వచ్చే ఎన్నికలలో దానికి వారి ఓట్లుపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ నేతలు కేంద్రం వైఫల్యానికి తెరాస సర్కార్ ను నిందిస్తున్నారు. 

ఏపిలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది కూడా సరిగ్గా ఇదే. ప్రత్యేకహోదా ఇవ్వవలసింది కేంద్రం కానీ అయన కేంద్రాన్ని పల్లెత్తు మాట అనకుండా నిత్యం చంద్రబాబు నాయుడునే నిందిస్తుంటారు. తద్వారా తెదేపా సర్కార్ పై ప్రజలలో వ్యతిరేకత పెంచగలిగితే వచ్చే ఎన్నికలలో అది వైకాపాకు అధికారం సంపాదించి పెడుతుందని ఆశ పడుతున్నారు. కనుక ఏపిలో వైకాపా చేస్తున్నదే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ చేస్తోందని చెప్పవచ్చు. ప్రజల విజ్ఞతను తక్కువగా అంచనా వేయడం వలననే వారు ఆవిధంగా వాదిస్తున్నారని చెప్పకతప్పదు. 


Related Post