కాంగ్రెస్ వ్యూహం అదేనా?

June 16, 2018


img

గుజరాత్, కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నేర్చుకున్న కొత్త రాజకీయ పాఠాలను 2019 ఎన్నికలలో కూడా అమలుచేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని  కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు.  ఇదివరకులాగ మొత్తం అన్ని లోక్ సభ స్థానాలకు పోటీ చేయకుండా 250 అంతకంటే తక్కువ స్థానాలకే పోటీ చేయాలని భావిస్తున్నారని తాజా సమాచారం. ఇప్పుడు రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు చాలా బలంగా ఉంటున్నాయి కనుక వచ్చే ఎన్నికలలో వాటికే ఎక్కువ సీట్లు కేటాయించి, కాంగ్రెస్ పార్టీకి బాగా బలమున్న స్థానాలలో మాత్రమే పోటీ చేసి, వాటి సహాయంతో భాజపాను ఎక్కడికక్కడ ఓడించగలిగితే కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవచ్చునని కాంగ్రెస్ వ్యూహనిపుణులు రాహుల్ గాంధీకి సూచించగా అయన అందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం. 

ఈ వ్యూహంలో ప్రాంతీయ పార్టీలకే ప్రాధాన్యత ఇవ్వడం వలన అవి తమ స్వంత బలంతో భాజపాను డ్డీకొని ఓడించే ప్రయత్నాలు చేస్తాయి కనుక కాంగ్రెస్ పార్టీపై ఎన్నికల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇప్పటికే యూపియే కూటమిలో అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. కనుక కొత్తగా మరికొన్ని పార్టీలతో కలిసిపనిచేయడం కాంగ్రెస్ పార్టీకి కష్టమేమీ కాదు. కొత్త పార్టీలు యూపియే కూటమిలో చేరినా చేరకపోయినా అవన్నీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే, భాజపాను అవలీలగా ఓడించవచ్చునని కాంగ్రెస్ వ్యూహకర్తలు అభిప్రాయపడుతున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో ఈ వ్యూహం ప్రకారమే దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ భాజపాను డ్డీ కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. 

వినేందుకు ఇది చాలా బాగానే ఉంది కానీ దానిని ఆచరణలో పెట్టడం చాలా కష్టమే. ఉదాహరణకు తెలంగాణాలో బలంగా ఉన్న తెరాసతో కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసే పరిస్థితి లేదని అందరికీ తెలుసు. కనుక తెదేపా, టిజెఎస్, బిఎల్ఎఫ్ వంటి పార్టీలు, కూటములను నమ్ముకోవలసి ఉంటుంది. కానీ అవి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాయా లేదా? ఇష్టపడినా వాటిని నమ్ముకోవడం వలన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ప్రయోజనం లభిస్తుందా లేదా? అనే అనుమానాలు న్నాయి. ఏపిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 

దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈ వ్యూహం అద్భుతంగా పనిచేయవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో టికెట్స్ కోసం చాలా ఒత్తిడి ఉంటుంది. కనుక ఈ వ్యూహాన్ని ఆచరణలో పెట్టాలంటే చాలామంది ఆశావాహులు త్యాగాలు చేయవలసి ఉంటుంది. లేదా వారే పార్టీని త్యాగం చేసే ప్రమాదం ఉంది. కనుక ఇది ఎంతవరకు సాధ్యమో ఎన్నికలు దగ్గరపడితే కానీ తెలియదు.

కానీ తమిళనాడులో డిఎంకె, పశ్చిమ బెంగాల్, యూపిలో సమాజ్‌వాదీ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలు ఈ ప్రతిపాదనకు ఎగిరి గెంతేయవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాటికి ఇటువంటి అవకాశం కల్పిస్తే అవి కూడా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పగలుగుతాయి కనుక. ఎన్నికలు దగ్గర పడిన తరువాత పొత్తులు, సీట్ల పంపకాలు మొదలైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ‘మిషన్ 250’ వ్యూహాన్ని అమలు చేయగలదో లేదో తెలుస్తుంది.


Related Post