తెలంగాణా పార్టీలపై కర్ణాటక ఎఫెక్ట్?

May 22, 2018


img

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అన్ని రాష్ట్రాలలోని రాజకీయ పార్టీల ఆలోచనలను ఎంతో కొంత ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే, వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉన్న టి-కాంగ్రెస్ నేతలకు ఈ పరిణామాలు నూతనోత్సాహం కలిగిస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కర్ణాటకలో భాజపాకు వ్యతిరేకంగా కూటమి కట్టి అధికారం దక్కించుకున్నట్లే, తెలంగాణాలో తెరాసకు వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేయవచ్చు. ఎన్నికలకు ముందు తెదేపా, సిపిఐ ఇతర చిన్న పార్టీలు దానితో చేతులు కలిపేందుకు ముందుకు రావచ్చు. ఎన్నికలలో తెలంగాణా జనసమితి, సిపిఎం నేతృత్వంలో ఏర్పడిన బిఎల్ఎఫ్ కూటమి కొన్ని సీట్లు సాధించుకోగలిగితే. ఎన్నికల తరువాత అవసరం, అవకాశం లభిస్తే అవి కూడా కాంగ్రెస్ పార్టీతోనే చేతులు కలుపవచ్చు.

ఇక భాజపాపై  కర్ణాటక ప్రభావం కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణాపై దృష్టి సారిస్తామని భాజపా నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ కెసిఆర్ కేవలం నోటి మాటగా జెడిఎస్ కు మద్దతు పలికితేనే కర్ణాటకలో భాజపాకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇక తెరాస-కెసిఆర్ ప్రభావం బలంగా ఉన్న తెలంగాణాలో భాజపా గెలవడం సంగతి దేవుడెరుగు.. కెసిఆర్ తదితరులు చేయబోయే ఎన్నికల ప్రచారం ధాటికి భాజపా తట్టుకొని నిలబడగలదా? అంటే అనుమానమే. కర్ణాటకలో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అధికారం దక్కించుకోవడానికి అది ప్రదర్శించిన అత్యుత్సాహం కారణంగా ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేకత కారణంగానే భాజపా అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. అదే కారణంగా దక్షిణాది రాష్ట్రాలలో అది మరింత నష్టపోవచ్చు. 

ఇక తెరాసకు ఈ పరిణామాలు పరస్పర విరుద్దమైన అనుభవాలను మిగిల్చాయని చెప్పవచ్చు. సిఎం కెసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు జెడిఎస్ మొదటి గుణపాఠం నేర్పింది. ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాయి తప్ప దేశాభివృద్ధి, రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు వంటి ఆలోచనలను అవి పట్టించుకోవని జెడిఎస్ నిరూపించి చూపించింది. యూపిలో మాయావతి, అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, ఏపిలో చంద్రబాబు, తమిళనాడులో స్టాలిన్ తదితరులు కూడా మున్ముందు అదేవిధంగా వ్యవహరిస్తారని గ్రహించడం చాలా అవసరం. 

ఇక కర్ణాటకలో కొత్తగా తెలిసొచ్చిన విషయం ఏమిటంటే తృతీయపార్టీగా ఉన్న జెడిఎస్ కు మద్దతు ఇస్తే అనూహ్య రాజకీయ పరిణామాలు సాధించవచ్చని నిరూపితమైంది. కనుక ఫెడరల్ ఫ్రంట్ తో జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు సాధించలేనప్పటికీ, రాజకీయ బలాబలాలను తారుమారు చేయవచ్చని స్పష్టం అయ్యింది. 

కెసిఆర్ మద్దతు ఇచ్చిన జెడిఎస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కనుక ఆ మేరకు ఆయనకు జాతీయ స్థాయిలో  తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారని చెప్పవచ్చు. 

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణా జనసమితి, బిఎల్ఎఫ్, తెదేపా తదితర పార్టీలపై కూడా కర్ణాటక రాజకీయాల ప్రభావం ఉంటుంది. ఆ స్పూర్తితో అవి సార్వత్రిక ఎన్నికలలో పరస్పరం సహకరించుకొనేందుకు సిద్దపడవచ్చు. 

చివరిగా..ఈ రాజకీయ చదరంగంలో బారీ మూల్యం చెల్లించుకున్న భాజపా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలో ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం కనబడుతోంది.


Related Post