వారిది మూన్నాళ్ళ ముచ్చటేనా?

May 22, 2018


img

కర్ణాటక ఎన్నికలలో 38 సీట్లు గెలుచుకున్న జెడిఎస్ కు ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన మంత్రి పదవులు అప్పగించడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్దపడుతుండటంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో అసంతృప్తి మొదలైంది. అదీగాక మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు మంత్రి పదవులు దక్కకపోతే రాజీనామాలకు సిద్దం అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యశ్వంతరాయ పాటిల్, శివానంద పాటిల్ బహిరంగంగానే పార్టీని హెచ్చరించారు. అలాగే పార్టీలో తమ ప్రత్యర్ధి ఎంబి పాటిల్ కు ఉపముఖ్యమంత్రి ఇచ్చినా తాము రాజీనామాలు చేస్తామని వారిరువురూ బెదిరిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి పదవి తీసుకోవడంలేదు కనుక కాంగ్రెస్ పార్టీకి రెండు ఉపముఖ్యమంత్రి పదవులు, కీలకమైన మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి పదవిని రొటేషన్ పద్దతిలో కాంగ్రెస్, జెడిఎస్ లు పంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రతిపాదనను కుమారస్వామి నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నారు. ఐదేళ్ళు తనే ముఖ్యమంత్రి ఉంటానని చెపుతున్నారు. 

రాష్ట్ర కాంగ్రెస్ నేతల డిమాండ్లు, వారిలో నెలకొన్న ఈ అసంతృప్తి గురించి మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పిసిసి అధ్యక్షుడు డిల్లీ వెళ్ళి అధిష్టానానికి చెపుదామనుకుంటే రాహుల్ గాంధీ వారిని డిల్లీ రావద్దని వారించినట్లు సమాచారం. కుమారస్వామితో చర్చలు ముగిసిన తరువాతే మాట్లాడుకొందామని చెప్పినట్లు సమాచారం.         

ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భాజపా మళ్ళీ రంగంలో దిగి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయకుండా ఊరుకొంటుందనుకోలేము. కనుక కాంగ్రెస్-జెడిఎస్ పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం చాలా అవసరం. లేకుంటే కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వం మూన్నాళ్ళ ముచ్చటగా మారే ప్రమాదం ఉంది.


Related Post