గవర్నర్ పర్యటన అర్ధంతరంగా ముగిసింది..ఎందుకో?

April 25, 2018


img

గవర్నర్ నరసింహన్ మంగళవారం రాత్రి డిల్లీ చేరుకొన్నారు. ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆ తరువాత మరికొందరు కేంద్రమంత్రులను కలువడానికి అపాయింట్మెంట్లు కూడా ఖరారయ్యాయి. కానీ ఎవరినీ కలవకుండానే వెనక్కు తిరిగి వచ్చేశారు. అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని రావలసిన అత్యవసర పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాలలోను లేవు. మరే ఇతర కారణాలు కూడా కనబడటం లేదు. 

నాలుగు రోజుల క్రితమే గవర్నర్ నరసింహన్ హటాత్తుగా విజయవాడ వెళ్ళి ఏపి సిఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా కేంద్రంతో సఖ్యతగా మెలిగితే మంచిదని సలహా ఇచ్చారని, కానీ కేంద్రప్రభుత్వం ఏపికి న్యాయం చేసేవరకు తెదేపా పోరాటం ఆపబోదని స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత గవర్నర్ నరసింహన్ డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులపై నివేదిక ఇవ్వనున్నారని వార్తలు రాగానే చంద్రబాబు హటాత్తుగా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

“గవర్నర్ నరసింహన్ తన హోదాను మరిచి ఒక రాజకీయ పార్టీ నాయకుడిలాగ వ్యవహరిస్తున్నారు. తెదేపాకు వ్యతిరేకంగా పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం అవినీతిపరులను చేరదీసి నన్ను అణగద్రొక్కేయాలని ప్రయత్నిస్తోంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ను కూడా మాపైకి ఎగదోస్తోంది. రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగితే నాపై వారిచేత అవినీతి ఆరోపణలు చేయిస్తోంది. నాకు వ్యతిరేకంగా ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. నేను పోరాడుతున్నది ప్రజలు..రాష్ట్రం కోసమే. కనుక రాష్ట్ర ప్రజలందరూ నాకు రక్షణగా నిలబడాలి. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయిస్తే, అయన గట్టిగా పోరాడి కేంద్రం మెడలు వంచారు. మనమందరం కలిసికట్టుగా పోరాడవలసిన అవసరం ఉంది,” అని అన్నారు. 

చంద్రబాబు మాటలను బట్టి కేంద్రం అయన ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయడమో లేదా కూలద్రోయడమో చేయవచ్చని అనుమానిస్తున్నట్లు అర్ధం అవుతోంది. కనుక అందుకే గవర్నర్ నరసింహన్ అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని వెనక్కుతిరిగి వచ్చారా?అనే అనుమానం కలుగుతోంది. అటువంటిదేమైన ఉంటె త్వరలోనే అందరూ చూస్తారు.


Related Post