కమిటీతో ఆ సమస్య పరిష్కారం అవుతుందా?

April 23, 2018


img

టాలీవుడ్ లో మహిళా ఆర్టిస్టులపై లైంగిక వేధింపులను ప్రశ్నిస్తూ నటిశ్రీరెడ్డి మొదలుపెట్టిన పోరాటం అనేకమలుపులు తిరిగి ఇప్పుడు ఏటో వెళ్ళిపోతోంది. రాంగోపాల్ వర్మ ప్రోత్సాహంతో ఆమె పవన్ కళ్యాణ్ తల్లిని ఉద్దేశ్యించి అన్న ఒక్క తప్పుడు మాటతో ఇప్పుడు కధ పూర్తిగా రివర్స్ అయ్యి రాజకీయరంగు పులుముకొంది. 

ఇప్పటివరకు శ్రీరెడ్డి తదితర ఆర్టిస్టులు చేస్తున్న తీవ్ర ఆరోపణలతో, కొన్ని మీడియా ఛానల్స్ వస్తున్న వార్తల కారణంగా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న టాలీవుడ్ పెద్దలకు, “పవన్ కళ్యాణ్ ను నేనే తిట్టమన్నాను...సురేష్ బాబును కాపాడేందుకు శ్రీరెడ్డితో 5 కోట్లు డీల్ చేయడానికి ప్రయత్నించాను...,” అంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఒక బలమైన ఆయుధంలాగ లభించింది. 

శ్రీరెడ్డి తదితరులు ఇండస్ట్రీలో తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీడియా ముందుకు వచ్చి మొరపెట్టుకొంటున్నప్పుడు ముందుకురాని సినీ నటీనటులు, సినీపెద్దలు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో, హడావుడిగా ఫిలిం ఛాంబర్ వద్దకు చేరుకొని మెగా ఫ్యామిలీకి మద్దతుగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. అందరూ కలిసి శ్రీరెడ్డి, కత్తి మహేష్, రామ్ గోపాల్ వర్మలపై ఎదురుదాడి చేయగలుగుతున్నారు. 

ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ కు జరిగిన అన్యాయం లేదా అవమానం గురించే మాట్లాడుతున్నారు తప్ప ఎవరూ శ్రీరెడ్డి తదితర నటులు లేవనెత్తిన ‘లైంగిక వేధింపుల సమస్య’ గురించి మాట్లాడటం లేదు. ఈ కుట్రల నుంచి, దాడుల నుంచి ఇండస్ట్రీని కాపాడుకోవలసిన బాధ్యత ఉందని మాట్లాడుతున్నారు.   

పవన్ కళ్యాణ్ కూడా నేరుగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, ఆయనకు వత్తాసు పలుకుతున్న కొన్ని మీడియా ఛానళ్ళను పేరు పెట్టి విమర్శించి, వారందరూ తనను ఉద్దేశ్యపూర్వకంగానే అప్రదిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో మెసేజులు పోస్ట్ చేయడం, తాను వారిపై ఒక సుదీర్ఘమైన న్యాయపోరాటం చేయబోతున్నానని ప్రకటించడంతో, అసలు సమస్య పక్కదారి పట్టి ఇదొక రాజకీయపోరాటంగా మారిపోయింది. 

ఇండస్ట్రీతో, ఈ సమస్యలతో ఎటువంటి సంబంధమూ లేని పవన్ కళ్యాణ్ తల్లి గురించి శ్రీరెడ్డి తప్పుడు మాటలు మాట్లాడటం, ఆవిధంగా చేయమని ఆమెను రామ్ గోపాల్ వర్మ ప్రోత్సహించడం రెండూ చాలా తప్పే. అందుకు వారిద్దరూ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పుకొన్నారు. 

శ్రీరెడ్డి ఒక తప్పుడు మాట అంటే ఇంత ఆగ్రహంతో ఊగిపోతున్న ఇండస్ట్రీ పెద్దలు, మరి టాలీవుడ్ లో మహిళా ఆర్టిస్టులపై నిత్యం ఆకృత్యాలు జరుగుతున్నాయని మోరపెట్టుకొన్నప్పుడు వారికి ఎందుకు ఇంత ఆగ్రహం కలగలేదు? కనీసం పవన్ కళ్యాణ్ ఆ ప్రస్తావన ఎందుకు చేయలేకపోయారు?

శ్రీరెడ్డి వంటి ఆర్టిస్టులు సాక్ష్యాధారాలతో సహా లైంగిక వేధింపుల వ్యవహరాలను బయటపెట్టినప్పుడు, ఆ ‘పెద్దమనుషులను’ బహిరంగంగా ఎందుకు నిలదీసి అడగలేకపోతున్నారు? పైగా పెద్దమనుషుల పరువు కాపాడటానికి వర్మ శ్రీరెడ్డితో రూ.5 కోట్లు డీల్ చేయడానికి ప్రయత్నించానని నిసిగ్గుగా చెప్పాడు!  

మెగాఫ్యామిలీని పల్లెత్తు మాటంటే ఇండస్ట్రీ మొత్తం కదలివచ్చేసి యుద్ధం ప్రకటించేసింది. ఇదే స్ఫూర్తి ‘క్యాస్టింగ్ కౌచ్’ సమస్య పరిష్కారానికి ఎందుకు చూపలేదు? అనే ప్రశ్నలకు ‘కమిటీ’ సమాధానం కాదు. ఎందుకంటే అది సమస్య పరిష్కారానికి కాక వాయిదా వేయడానికి మాత్రమే పనికి వస్తుందని అందరికీ తెలుసు. దాని ఏర్పాటుపై ఇండస్ట్రీ పెద్దల మద్య ఏకాభిప్రాయానికి రాలేకపోయారంటే పరిస్థితి అర్ధం అవుతుంది. మన ఫిలింఇండస్ట్రీ ద్వందవైఖరికి ఇవన్నీ నిదర్శనం అని చెప్పవచ్చు.  

నిజానికి తెలుగు సినీ పరిశ్రమపై బయట నుంచి ఎవరూ దాడి చేయడం లేదు. లోపలున్న కొందరు వ్యక్తుల కారణంగానే అది ఈవిధంగా రోడ్డున పడుతోందని చెప్పక తప్పదు. కానీ ఈ నిజాన్ని ఒప్పుకొనే ధైర్యం ఇండస్ట్రీలో ఎవరికీ లేదు. కనుక మూకుమ్మడిగా తమను ప్రశ్నిస్తున్నవారిపై ఎదురుదాడి చేస్తూ అసలు సమస్యను పక్కదారి పట్టించేసి, దానిలో దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. 

గత ఏడాది మాదకద్రవ్యాల కేసులు వెలుగు చూసినప్పుడు ఇండస్ట్రీలో వారు ఇదేవిధంగా స్పందించారు. సమస్యలను పరిష్కరించుకోలేక వాటిని గొయ్యి తీసి కప్పేస్తూ...వాటిని బయటపెట్టినవారిని తొక్కుకొంటూ ముందుకు సాగిపోవడం పరిపాటిగా మారిపోయింది. తెలుగు సినీ పరిశ్రమ పరిస్థితి చూస్తే పైన పటారం లోన లొటారం అన్నట్లుంది.


Related Post