ఓయును రాష్ట్ర ప్రభుత్వం వెలి వేసిందా?

April 21, 2018


img

ఉస్మానియా యూనివర్సిటీ...పరిచయమే అక్కరలేని ఒక గొప్ప పేరు. ఎందరో మహానుభావులు...ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకొన్నారు. దేశవిదేశాలలో అత్యున్నతమైన పదవులు చేపట్టారు. దేశానికి, రాష్ట్రానికి గొప్ప పేరు సంపాదించిపెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడం కోసం విద్యార్ధులు తహతహలాడుతారు.  ఎందుకంటే దానిలో చదువుకొన్నామంటే ఆ విలువా..గౌరవమే వేరు. 

ఒకప్పుడు సమైక్యరాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ యావత్ రాష్ట్రానికి చదువుల కేంద్రంగా ఉండేది. ఇక తెలంగాణాకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి అది బంగారు కిరీటం ధరించిన చదువుల సరస్వతిలా శోభిల్లేది. ఉస్మానియా యూనివర్సిటీతో తెలంగాణా ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలకు విడదీయలేని బలమైన ఆత్మీయ అనుబంధం ఉందనే సంగతి అందరికీ తెలుసు. 

ఇక తెలంగాణా సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులే ముందువరుసలో ఉండేవారని సంగతి అందరికీ తెలిసిందే. వారు తెలంగాణా రాష్ట్ర సాధనకోసం తమ జీవితాలను, ఉజ్వల భవిష్యత్ ను...చివరికి ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాటాలు చేశారు. తెలంగాణా ఏర్పడింది కానీ అప్పటి నుంచే ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి దయనీయంగా మారిందంటే అబద్దం కాదు. 

ఇక వంద సం.లు చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ దేశంలో అతిపురాతనమైన యూనివర్సిటీలలో ఒకటిగా నిలబడటం మనందరికీ గర్వకారణం. ఇంత మహోన్నతమైన ఉస్మానియా యూనివర్సిటీపై తెరాస సర్కార్ కు ఎందుకో ఆగ్రహం కలిగింది. అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు ఎవరూ యూనివర్సిటీవైపు తొంగిచూడరు. తెలంగాణా రాష్ట్రానికే గర్వకారణంగా నిలుస్తున్న అటువంటి మహోన్నతమైన యూనివర్సిటీని ప్రభుత్వమే వెలి వేసినట్లుగానే వ్యవహరిస్తుండటం విద్యార్ధులకు, విద్యావేత్తలకు అందరికీ చాలా బాధ కలిగిస్తోంది. 

తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకే ఒకసారి దానిలో కాలుపెట్టారు. గత ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది వేడుకల ప్రారంభోత్సవానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా వచ్చారు. కానీ ఆ సభలో అయన ఒక్క ముక్క మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీవైపు తిరిగి చూసింది లేదు. 

రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో నడిచే ఉస్మానియా యూనివర్సిటీపై ప్రభుత్వమే కత్తి కట్టినట్లు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరమే. బహుశః ఆ కారణంగానే యూనివర్సిటీలో జరుగవలసిన ప్రతిష్టాత్మకమైన సైన్స్ కాంగ్రెస్ సదస్సు వేరే రాష్ట్రానికి తరలిపోయిందని విద్యార్ధులు, విద్యావేత్తలు చాలా బాధపడ్డారు. 

జరిగిపోయిన దానికి ఇప్పుడు విచారించి ఏమీ ప్రయోజనం లేదు. కానీ ఈనెల 25న జరుగబోయే ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ ముగింపు వేడుకలకు ప్రముఖులు (ప్రభుత్వం తరపున) ఎవరూ హాజరుకారని వైస్-ఛాన్సిలర్ రామచంద్రం తెలిపినపుడు ఇంకా బాధ కలుగుతుంది. యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్లు, విద్యార్ధులు కలిసి ఈ వేడుకలను నిర్వహించుకోబోతున్నట్లు తెలిపారు. 

ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వాటి నిర్వహణ, యూనివర్సిటీ భవనాలు, రోడ్లు మరమత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గత ఏడాది ప్రకటించింది. కానీ ఇంతవరకు దానిలో రూ.50 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వైస్-ఛాన్సిలర్ రామచంద్రం చెప్పారు. మరో నాలుగు రోజులలో ఈ ఈ వేడుకలు ముగిసిపోతున్నాయి కనుక మిగిలిన డబ్బును ప్రభుత్వం విడుదల చేస్తుందో లేదో? ఇంతకీ ఉస్మానియా యూనివర్సిటీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కోపం వచ్చిందో? 


Related Post