పంతం కోసం తెరాస ప్రతిష్టను పణంగా పెడుతోందా?

April 21, 2018


img

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వం రద్దు కేసులో సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని తెరాస ఎమ్మెల్యేలు కోరుతుంటే, అసలు వారి పిటిషన్ ను (అత్యవసరంగా) చేపట్టడానికే హైకోర్టు ధర్మాసనం నిరాకరించడం తెరాసకు అవమానకరమేనని చెప్పవచ్చు. హైకోర్టు ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టి, ఒకవేళ అది కూడా సింగిల్ జడ్జి తీర్పునే సమర్ధిస్తే అప్పుడు తెరాస సర్కార్ కు ఇంకా అవమానకరమవుతుంది. అప్పుడు వారు సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. 

ఒకవేళ హైకోర్టు ధర్మాసనం ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దును సమర్ధిస్తే, అప్పుడు వారు సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఖాయం. అంటే ఏవిధంగా చూసినా ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్ళడం ఖాయం అని స్పష్టం అవుతోంది. కనుక ఈ కేసు మరో 4-5 నెలలు కొనసాగవచ్చు. 

ఒకవేళ సుప్రీం కోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు విరుద్దంగా తీర్పు వచ్చినా అప్పటికి సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడతాయి కనుక వారికి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ అప్పటికి మరొక ఆరు నెలలోగా సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కనుక వారిరువురూ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ఉపఎన్నికలు నిర్వహించకూడదని ఎన్నికల కమీషన్ నిర్ణయించినా ఆశ్చర్యం లేదు. అంటే వ్రతం చెడిన ఫలం దక్కదన్న మాట. 

ఒకవేళ సుప్రీం కోర్టులో కూడా ఈ కేసులో తెరాస ఓడిపోతే అది తెరాసకు ఇంకా అవమానకరమవుతుంది. అంతే కాదు.. కాంగ్రెస్ నేతలు మళ్ళీ తెరాసను ఎండగట్టకుండా వదిలిపెట్టరు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని లెక్కచేయని తెరాసకు సుప్రీంకోర్టు కూడా గట్టిగా బుద్ధి చెప్పిందని వారు ఎన్నికల వరకు...ఎన్నికలలో కూడా ప్రచారం చేసుకొంటారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిని చాలా హైలట్ చేయకుండా వదిలిపెట్టరు. 

అంటే ఈ కేసులో తెరాస గెలిచినా ఓడినా దానికే నష్టం తప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాదని అర్ధమవుతోంది. కనుక తెరాస తన పంతం నెరవేర్చుకోవడానికి తన ప్రతిష్టను పణంగా పెట్టడం అవసరమా? అని పునరాలోచన చేస్తే మంచిదేమో?



Related Post