అప్పుడు నేను...ఇప్పుడు మీరు..సేమ్ టు సేమ్

April 18, 2018


img

ప్రతిపక్ష బెంచీలలో కూర్చొన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు...ఎంతైనా మాట్లాడవచ్చు. కానీ అధికారంలోకి వస్తే ఆచితూచి మాట్లాడక తప్పదు. లేకుంటే ఊహించలేని సమస్యలు వస్తాయి. ఒకప్పుడు భాజపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వివిధ సమస్యలపై అప్పటి యూపియే ప్రభుత్వాన్ని పార్లమెంటులోపల బయటా గట్టిగా నిలదీస్తుండేది. అది సహజం కూడా. సహజంగానే మితభాషి అయిన అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేతలే స్పందిస్తుండేవారు. ఆ కారణంగా ఆయనను ‘మౌన్ మోహన్ సింగ్’ అని నరేంద్ర మోడీ ఎద్దేవా చేసేవారు. 

ఇప్పుడు ఆ మౌనపాత్రను ప్రధాని నరేంద్ర మోడీ పోషిస్తున్నారని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎద్దేవా చేశారు. దేశంలో ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే యావత్ దేశమంతా స్పందిస్తోంది కానీ ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం స్పందించడం లేదు. ఎందుకు? ఆనాడు నన్ను ఎగతాళి చేసిన మోడీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? పసిపిల్లలు, చిన్నారి బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే స్పందించవలసిన బాధ్యత మీకు లేదా? ఆరోజు నన్ను నోరు విప్పి సమస్యల గురించి మాట్లాడమని హితభోదచేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మౌనం వీడి అత్యాచారాలపై నోరు విప్పి మాట్లాడండి. ప్రధాని హోదాకు తగినట్లు మాట్లాడటం నేర్చుకోండి. త్వరలోనే మీకు జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు.


Related Post