రాత్రయితే ఫిలింనగర్ రెడ్ లైట్ ఏరియా కంటే హీనం!

April 16, 2018


img

సినీ పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులపై తెర వెనుక జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులపై నటి శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలియజేసిన తరువాత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యులు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి, ఇండస్ట్రీలో అటువంటివేవీ జరగడంలేదని, జరుగుతున్నట్లయితే వాటిని అరికట్టడానికి ‘క్యాష్ కమిటీ’ ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

వారు ప్రెస్ మీట్ పెట్టిన రెండురోజులకే మహిళా సంఘాల అధ్వర్యంలో సినీ జూనియర్ ఆర్టిస్ట్స్ ఆదివారం హైదరాబాద్ లో ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసి, తమను సినీ పరిశ్రమలో అందరూ ఏవిధంగా వాడుకొంటున్నారో వివరించారు. సినీపరిశ్రమలో పగలు నీతులు చెప్పేవారు చీకటిపడితే ఏ ఆడపిల్లను పక్కలోకి పిలిపించుకొందామా? అని చూస్తుంటారని నటి సునీతా రెడ్డి ఆరోపించారు. రాత్రయితే ఫిలిం నగర్ ఒక రెడ్ లైట్ ఏరియాలా మారిపోతుందని ఆరోపించారు. సినీ పరిశ్రమలో కో-ఆర్డినేటర్లు జూనియర్ మహిళా ఆర్టిస్టులను సినీ ప్రముఖులకు సప్లై చేసే బ్రోకర్లుగా మారిపోయారని ఆరోపించారు. సినిమాలు చేసినందుకు నిర్మాతలు ఇచ్చిన డబ్బును కూడా పూర్తిగా ఇవ్వకుండా కో-ఆర్డినేటర్లు తమను మోసం చేస్తున్నారని నటి సునీతా రెడ్డి ఆరోపించారు. ఒక సినిమాలో చిన్న వేషం కావాలంటే సినీ ప్రముఖులను శారీరకంగా సుఖపెట్టడానికి అంగీకరించినవారికే కో-ఆర్డినేటర్లు ప్రాధాన్యత ఇస్తారని ఆమె అన్నారు. 

సోనా రాధోడ్ అనే నపుంసకరాలు మాట్లాడుతూ ‘నేను నపుంసకురాలినని దృవీకరించుకొనేందుకు నన్ను అనేకసార్లు బట్టలు విప్పించి చూసేవారు. నేను నపుంసకరాలినని తెలిసినా ఎవరూ నన్ను విడిచిపెట్టలేదు. ఇక అందమైన మహిళా నటులను ఎందుకు వదిలిపెడతారు? అని ప్రశ్నించారు. 

మాపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఇంత బహిరంగంగా చెపుతున్నా సినీ పెద్దలు ఎవరూ ఎందుకు నోరు విప్పడం లేదని వారు ప్రశ్నించారు. ఒకవేళ వారు ఇకనైనా నోరు విప్పి మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించకపోతే అందరి గుట్టూ బయటపెడతామని జూనియర్ ఆర్టిస్టులు హెచ్చరించారు.  

నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీరెడ్డి, సునీతారెడ్డి, సోంగా రాధోడ్, అపూర్వ, హేమ, శోభిత, తేజస్విని, రుక్మిణీ రావు, దివ్య, స్వరూప తదితర అనేకమంది జూనియర్ ఆర్టిస్టులు హాజరయ్యారు. వారితో పాటు మహిళా సంఘాల నేతలు కొండవీటి సత్యవతి, రమా మెల్కోటే, సుజాత, ఝాన్సీ, సునీత, సంధ్య, సిస్టర్ లిజీ, రత్న తదితరులు అనేకమంది హాజరయ్యి వారి సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారం కోసం కలిసికట్టుగా పోరాడుదామని చెప్పారు.  Related Post