కర్ణాటక ఎన్నికలలో కెసిఆర్ ప్రచారం..దేనికంటే...

April 14, 2018


img

ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి మాజీ ప్రధాని దేవగౌడతో చర్చించడానికి వెళ్ళిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఒకవేళ ఆ పార్టీ ఆహ్వానిస్తే దాని తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పడం విశేషం. మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్-భాజపాల మద్యనే పోటీ ఉండబోతోంది. ఆ రెండు పార్టీలను వ్యతిరేకిస్తున్న కెసిఆర్ వాటికి ప్రత్యామ్నాయంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొంటున్నారు. కనుక తనతో చేతులు కలపడానికి సానుకూలంగా ఉన్న దేవగౌడకు చెందిన జెడిఎస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని, తన ఆలోచనలను కర్ణాటక ప్రజలతోను పంచుకొని వారిని ఆకర్షించవచ్చునని కెసిఆర్ భావిస్తుండవచ్చు. ఆయనకు కన్నడిగుడైన ప్రకాష్ రాజ్ కూడా మద్దతు ఇస్తున్నారు కనుక కర్ణాటక ప్రజలకు సులువుగానే చేరువకావచ్చు. ఈ ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ తెలంగాణాలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను కర్ణాటక ప్రజలకు వివరించి తన అపూర్వమైన వాగ్ధాటితో వారిని ఆకట్టుకోవడం సాధ్యమే. కానీ అయన జెడిఎస్ ను గెలిపించలేకపోయినా, కాంగ్రెస్, భాజపాల విజయావకాశాలను దెబ్బ తీయగలరని చెప్పవచ్చు. మరోవిధంగా చెప్పుకోవాలంటే ఇది కెసిఆర్ తన శక్తిసామర్ధ్యాలను, జాతీయ స్థాయిలో గుర్తింపును పరీక్షించుకోవడానికి, చాటి చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా చెప్పవచ్చు. 

ఒకవేళ ఈ ప్రయత్నంలో కెసిఆర్ విజయవంతమైతే, కాంగ్రెస్, భాజపాలను ఎదిరించి నిలిచినా నేతగా కొత్త గుర్తింపు తెచ్చుకోగలరు. అప్పుడు వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలకు అయన నాయకత్వంపై నమ్మకం పెరిగి, ఆయనతో చేతులు కలపడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. కనుక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ తో సహా తెరాస నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.


Related Post