ఎనిమిదేళ్ళ పాపపై అత్యాచారం..వాళ్ళు మనుషులేనా?

April 14, 2018


img

జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కతువా గ్రామానికి చెందిన అసిఫా బానో అనే ఎనిమిదేళ్ళ పాపను కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఇంత హేయమైన పని చేసినవారిని మనుషులని భావించడం కూడా తప్పే. ఆమెపై అత్యాచారం చేసినవారిలో ఒక పోలీస్ అధికారి, ఒక రెవెన్యూ అధికారి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రజలను కాపాడవలసినవారే అభంశుభం తెలియని పసిపాపను ఇంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం చాలా దారుణం.

అంతకంటే దారుణమైన విషయమేమిటంటే, ఈ అత్యాచారం, హత్య సంఘటనలపై జరుగుతున్న నీచరాజకీయాలు. ఇంత దారుణమైన సంఘటన జరిగితే వెంటనే దోషులను గుర్తించి న్యాయస్థానం ముందు నిలబెట్టవలసిన నేతలే, దోషులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించడం దారుణం. ఈ ఘటన ఈ ఏడాది జనవరి 17వ తేదీన బయటపడితే, ఇంతవరకు అది బయటకు పొక్కకుండా దాచిపెట్టారు. చివరికి జమ్ము కాశ్మీర్ ప్రజలు నిరసనలు తెలియజేస్తూ రోడ్లపైకి వస్తేగానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేల్కొనలేదు.

ఈ సంఘటనపై జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చి, ఉత్తరాది రాష్ట్రాలలో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ లేవనెత్తడం మొదలుపెట్టిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా మౌనం వీడి ఈ సంఘటనలను ఖండించారు. ఆ తరువాతే దోషులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న జమ్ము కాశ్మీర్ ప్రభుత్వంలోని ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆ తరువాతే యూపిలో 16 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన భాజపా ఎమ్మెల్యే, అతని సోదరుడు మిగిలిన దోషులను పోలీసులు అదుపులోకి తీసుకొనే సాహసం చేయగలిగారు.   

అభంశుభం తెలియని ఎనిమిదేళ్ళ పాపపై, ఇంకా అప్పుడే లోకం అంటే ఏమిటో అర్ధం చేసుకొంటున్న 16 ఏళ్ళ బాలికపై  జరిగిన సామూహిక అత్యాచారాల కంటే ఆ సంఘటనలపై రాజకీయ నాయకుల స్పందనలు, వారు చేస్తున్న రాజకీయాలు చాలా నీచంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మనుషులలో మానవత్వం ఉందా లేదా? అని అనుమానం కలుగుతోంది. 


Related Post