మమతను నమ్ముకొంటే...

March 17, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేయబోతున్న ధర్డ్ ఫ్రంట్ గురించి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించేందుకు సోమవారం కోల్ కొతా వెళ్ళబోతున్నారు. కేసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించగానే మొట్టమొదట ఆమె ఫోన్ చేసి కెసిఆర్ కు సంఘీభావం తెలిపారు. కనుక మొదట ఆమెతోనే మాట్లాడి ఫ్రంట్ ఏర్పాట్లు మొదలుపెట్టాలని కేసిఆర్ నిర్ణయించుకొన్నారు. 

మమతా బెనర్జీ గొప్ప నాయకురాలు. దాదాపు మూడు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన కమ్యూనిస్టులను, ఒంటి చేత్తో మట్టి కరిపించిన పోరాటయోధురాలు. అయితే ఆమెకు నిలకడ చాలా తక్కువని పలుమార్లు నిరూపితమైంది. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దానిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా భాగస్వామి కావాలనుకొంటున్నారు. అయితే ఆమె కేసిఆర్ కు సంఘీభావం తెలిపిన తరువాత కాంగ్రెస్ పార్టీతో మంతనాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షతన ఏర్పాటు  కాబోతున్న మహాకూటమి గురించి చర్చించేందుకు ఆమె ఈనెల 28న డిల్లీ వెళ్ళి సోనియా, రాహుల్ గాంధీలతో సమావేశం కాబోతున్నారు. కెసిఆర్ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొమ్తున్నారో మమతా బెనర్జీ అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి మంతనాలు చేస్తున్నారు. మరి అటువంటి వ్యక్తిని కెసిఆర్ సంప్రదించవలసిన అవసరం ఏమిటో అర్ధం కాదు. ఒకవేళ కాంగ్రెస్ కంటే ధర్డ్ ఫ్రంట్ లో చేరితేనే ఎక్కువ రాజకీయ లబ్ది కలుగుతుందని భావించి ఆమె కెసిఆర్ తో చేతులు కలిపినా, అటువంటి అవకాశవాద రాజకీయ నేతలతో ఏర్పడే ధర్డ్ ఫ్రంట్ దేశప్రజలను ఏవిధంగా మెప్పించగలదు? ఒకవేళ మెప్పించి వచ్చే ఎన్నికలలో గెలిచినా అది ఎంతకాలం మనుగడ సాగించగలదు? జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నానని కేసీఆర్ చెపుతున్నప్పుడు, అయన ఎంచుకొనే భాగస్వాములకు కూడా విశ్వసనీయత కలిగి ఉండాలి. అప్పుడే అయన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి.


Related Post