దేశానికి మళ్ళీ కాంగ్రెస్ పాలన అవసరమా?

March 17, 2018


img

పదేళ్ళపాటు కాంగ్రెస్ పాలన ఏవిధంగా సాగిందో దేశప్రజలందరూ చూశారు. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలతో సాగిన పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో దాదాపు అన్ని రంగాలు కుప్పకూలిపోయే పరిస్థితికి చేరుకొన్నాయి. ఆ కారణంగానే దేశప్రజలు కాంగ్రెస్ ను దించి భాజపాకు అధికారం కట్టబెట్టారు. 

కాంగ్రెస్ తో పోలిస్తే మోడీ పాలనలో అభివృద్ధిపధంలో సాగుతున్నప్పటికీ, మళ్ళీ భాజపా ట్రేడ్ మార్క్ మతతత్వం ప్రస్పుటంగా కనిపిస్తోంది. ఇక మోడీ సర్కార్ తీసుకొన్న ‘సాహసోపేత నిర్ణయాల’ వలన దేశానికి ఏమైనా ప్రయోజనం కలిగిందో లేదో తెలియదు కానీ చిల్లర వర్తకులు, సామాన్య ప్రజల బ్రతుకులు దయనీయంగా మారాయి. ఒకపక్క సామాన్యుల సమస్యలు నానాటికీ పెరిగిపోతుంటే మరోపక్క విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ప్రతాప్ కొఠారి వంటి ఆర్దికనేరగాళ్ళు బ్యాంకులకు లక్షల కోట్లు ఎగవేసి దర్జాగా తప్పించుకుపోతున్నారు. ఆ కారణంగా దేశ ఆర్ధికవ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతోంది. ఆ అర్దికనేరగల్లు చేసిన మోసాలకు సామాన్య ప్రజలు మూల్యం చెల్లించవలసివస్తోంది. 

ఈ నేపధ్యంలో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కానీ నేటికీ దేశప్రజల ముందు భాజపా, కాంగ్రెస్ పార్టీలు తప్ప మరొకటి కనబడటం లేదు. కనుక కెసిఆర్ చెప్పినట్లు, ఒక పార్టీ మీద కోపం వస్తే రెండో దానికి, దాని మీద కోపం వస్తే మళ్ళీ మొదటి దానికి ప్రజలు ఓట్లేసి అధికారం కట్టబెట్టక తప్పనిసరి పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలు, ప్రభుత్వాలు, పధకాల పేర్లు మారుతున్నాయే తప్ప ఆచరణలో ఎటువంటి మార్పు కనబడటం లేదనే కెసిఆర్ మాటలు నూటికి నూరు శాతం నిజమేనని చెప్పక తప్పదు. 

అందుకే జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం ఆ రేను పార్టీలకు ప్రత్యామ్నాయంగా కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు. కానీ అది కూడా అనేక అవకాశవాద రాజకీయ పార్టీల సమాహారమే అవుతుంది కనుక అది భాజపా, కాంగ్రెస్ ల కంటే గొప్పగా పాలన అందించగలదని ఆశించడం అత్యాశే అవుతుంది. 

అయితే మోడీ హయంలో ఏర్పడిన సమస్యలన్నిటినీ పరిష్కరించాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్లీనరీ సభలలో గట్టిగా చెపుతున్నారు. దేశంలో మళ్ళీ జాతీయవాదం, దేశసమగ్రత విలసిల్లాలంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వక తప్పదు అని గట్టిగా చెపుతున్నారు. అది నిజమే కావచ్చు కానీ ఆ రెంటితోపాటు ‘కాంగ్రెస్ మార్క్ అన్ని అవలక్షణాలను’ కూడా దేశప్రజలు భరించాల్సి ఉంటుంది. కనుక 2019 ఎన్నికలలో దేశప్రజలు ఏ పార్టీకి ఓటేయాలి? దేనికి అధికారం కట్టబెట్టాలి? అనే ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేని స్థితి ఉంది. మరి ధర్డ్ ఫ్రంట్ పెడతానంటున్న కెసిఆర్ దీనికేమైనా సమాధానం చెప్పగలరేమో చూడాలి. 


Related Post