కటినమైనదే కానీ సరైన నిర్ణయమే

March 13, 2018


img

కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్లపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందిస్తూ “ఇది చాలా కటినమైన నిర్ణయమే కానీ తప్పలేదు. అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తునందునే నాలుగేళ్ళుగా తెలంగాణాలో శాంతిభద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయి. రాజకీయాలలో ఇంత అసహనం పనికిరాదు. ప్రజాప్రతినిధులమని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తామంటే చూస్తూ ఊరుకోము. ఎంతటివారైన సభా మర్యాదలు పాటించాల్సిందే,” అని అన్నారు. 

కాంగ్రెస్ సభ్యులు నిన్న శాసనసభలో వ్యవహరించిన తీరు చాలా అనుచితంగా ఉంది. నిరసనలు తెలపడం తప్పు కాదు కానీ రాష్ట్రానికి ప్రధమ పౌరుడైన గవర్నర్ నరసింహన్ మీదకు హెడ్ ఫోన్ సెట్ విసరడమే చాలా తప్పు. పైగా గతంలో తెరాస ఎమ్మెల్యేలు కూడా ఈవిధంగానే చేశారని కాంగ్రెస్ నేతలు వాదించడం సిగ్గుచేటు. గతంలో అటువంటి తప్పు జరిగింది కనుక ఇప్పుడు అదే తప్పు తాము చేసినా తప్పు కాదని వారు వాదిస్తున్నట్లుంది. చేసిన తప్పుకు పశ్చాతాపపడే బదులు తమ తప్పును వారు ఆ విధంగా సమర్ధించుకోవడం ఇంకా పెద్ద తప్పు. కనుక వారిని సభ నుంచి సస్పెండ్ చేయడం తప్పు కాదనే చెప్పాలి.  

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వం రద్దు చేయడం చాలా కటినమైన నిర్ణయమే. భవిష్యత్ లో మళ్ళీ ఎవరూ ఇటువంటి తప్పు చేయకుండా ఉండేందుకు ఇటువంటి కటినమైన నిర్ణయం తీసుకోవడం అవసరమే. చట్టసభలలో ప్రజాసమస్యలపై చర్చ జరగాలని ప్రజలు ఆశిస్తారు. కానీ ప్రజాప్రతినిధులమనే అహంకారంతో ఏమి చేసినా చెల్లుతుందనుకొనే ఎమ్మెల్యేలు ఇంత అనుచితంగా ప్రవర్తించినప్పుడు ఇటువంటి కటిన నిర్ణయాలు తీసుకోవడం మంచిదే. 


Related Post