జైపాల్ రెడ్డి వెర్సస్ డికె అరుణ?

February 24, 2018


img

కాంగ్రెస్ పార్టీ అంటే కొన్ని ముఠాల సమూహం. సాధారణ పరిస్థితులలో అవన్నీ పైకి ఒకటిగా కనిపిస్తుంటాయి కానీ అవెన్నడూ ఒకదానితో ఒకటి కలవవు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు అవన్నీ బయటకు వచ్చి తమ ఉనికిని చాటుకొంటుంటాయి. తెలంగాణా కాంగ్రెస్ కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. 

భాజపా నేత నాగం జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రప్పించి నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఇప్పించడానికి జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం కృషి చేస్తుంటే, నాగంను పార్టీలోకి రాకుండా అడ్డుకోవడానికి డికె అరుణ వర్గం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అదే పనిమీద డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీకి తమ అభ్యంతరాలు వ్యక్తం చేసి వచ్చామని, అయినా నాగంను పార్టీలో చేర్చుకొంటే ఆయనకు సహకరించబోమని డికె అరుణ వర్గానికి చెందిన దామోదర్ రెడ్డి మొన్ననే స్పష్టం చేశారు. పనిలోపనిగా జైపాల్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

అప్పుడు సహజంగానే జైపాల్ రెడ్డి వర్గం స్పందించవలసి వచ్చింది. ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, చల్లా వంశీ చంద్ రెడ్డిలు దామోదర్ రెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. “ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు కాంగ్రెస్ లోకి వస్తామంటే ఆహ్వానించాలి తప్ప ఇటువంటి విమర్శలు చేయడం సరికాదు. కాంగ్రెస్ లో పుట్టిపెరిగిన నేతలెవరూ ఇతర పార్టీల నేతలను వస్తే అభ్యంతరాలు చెప్పరు. వేరే పార్టీలలో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినవారే చెపుతున్నారు. దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచేందుకు నాగం జనార్ధన్ రెడ్డే సహాయం చేశారు. ఆ సంగతి అయన అప్పుడే మరిచిపోయినట్లున్నారు. తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి వస్తే నేను నా వనపర్తి సీటును త్యాగం చేయడానికి సైతం సిద్దం,” అని ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. 

ఎన్నికలు దగ్గర పడుతుంటే పార్టీలో ఐఖ్యత కనబడాలి. అందరూ కలిసి సమిష్టి పోరాటం చేయాలి. కానీ ఎన్నికలు దగ్గర పడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఆ ‘టీమ్ స్పిరిట్’ కనుమరుగవుతుంటుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఇప్పుడే కీచులాడుకొంటున్నారు ఇక ఎన్నికలొస్తే ఏవిధంగా కత్తులు దూసుకొంటారో చూడాలి. వారి అనైఖ్యతే వారికి, కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారుతుందని 2014ఎన్నికలలోనే రుజువయింది. అయినా కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదు. కనుక వారి అనైఖ్యతే తెరాసకు శ్రీరామరక్షగా నిలువవచ్చు.


Related Post