స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన

February 17, 2018


img

తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో బయ్యారం వద్ద, ఏపిలో కడప వద్ద స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి దాదాపు నాలుగేళ్ళు గడిచిపోయాయి. అయినా ఇంతవరకు వాటిని ఏర్పాటు చేయలేదు. వాటి కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నాయి. వాటి ఏర్పాటుపై సర్వేలు, అధ్యయనాలు, నివేదికలు, డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు అంటూ కేంద్రం కాలక్షేపం చేస్తోంది. 

అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన చివి బడ్జెట్ లో కూడా వాటి ప్రస్తావన లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, పార్టీలు, పాలకులు కూడా తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపిలో మిత్రపక్షమైన తెదేపా భాజపాతో తెగతెంపులకు సిద్దపడుతుండటం, తెదేపా, వైకాపా ఎంపిలు రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తుండటంతో కేంద్రం ఈ స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటుపై మళ్ళీ ప్రకటన చేయక తప్పలేదు. అయితే ఇప్పుడు కూడా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ చౌదరి అధ్యయనాలు, నివేదికలు, డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు అంటూ చిలకపలుకులే పలకడం విశేషం.

డిల్లీలో అయన మీడియాతో మాట్లాడుతూ, “బయ్యారం, కడపలో స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటులో సాధ్యాసాధ్యాలపై మికాన్ సంస్థ అధ్యయనం చేస్తోంది. దాని నివేదిక కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఆ సంస్థ ప్రతినిధులతో దీనపై ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యి చర్చించాము. వీటి ‘నమూనా నివేదిక’ రూపొందించేందుకు మరింత సమాచారం అవసరం అయ్యింది. దాని కోసం రెండు రాష్ట్రా ప్రభుత్వాలకు మేము లేఖలు వ్రాశాము. ఆ వివరాలు, మెకాన్ సంస్థ నివేదిక అందగానే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకొంటాము,” అని చెప్పారు. 

గత మూడేళ్ళు సాగుతున్న ఈ ‘తంతు’ ఈ ఏడాది చివరి వరకు కూడా సాగదీయడం పెద్ద కష్టమేమీ కాదు. కనుక వచ్చే ఎన్నికలలో కూడా తమనే ఎన్నుకొంటే తప్పకుండా స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే సరిపోతుందని మోడీ సర్కార్ భావిస్తోందేమో? 


Related Post