ఎర్రజొన్నలపై కూడా రాజకీయాలా?

February 16, 2018


img

కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఆ జాబితాలో కందులు, ఎర్రజొన్నలను కూడా చేర్చాయి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించి, నీటి సౌకర్యం ఏర్పడటంతో టమేటోలు, మిర్చి, కందులు, ఎర్రజొన్నలు బాగా పండాయి. పంటలు బాగా పండటం ఒక ఎత్తయితే, వాటిని అమ్ముకోవడం మరో ఎత్తు. 

ఈసారి కూడా దళారులు, వ్యాపారులు చేతులు కలిపి మిర్చి రైతులను నిలువునా ముంచారు. టమేటోలకు కేజీకి 50 పైసలు ధరలు పలకడంతో రైతులు రోడ్లపై పారబోసిపోయారు. బారీగా తరలివస్తున్న కందులను కొనుగోలు చేయలేక వ్యవసాయ మార్కెట్లకు శలవులు ప్రకటించేసి అధికారులు మాయం అయిపోయారు. ఎర్రజొన్న రైతన్నలకు ఇటువంటి కష్టాలే ఎదుర్కొంటున్నారు. కనుక ఇదే అదునుగా కాంగ్రెస్,భాజపా నేతలు తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించసాగారు. 

వ్యవసాయాన్ని పండుగలాగ మారుస్తామని, లాభసాటిగా చేస్తామని తెరాస సర్కార్ ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతుల పరిస్థితులలో ఎటువంటి మార్పు కనబడటం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రమే రైతులను ఆదుకోవాలంటే మరి తెరాస సర్కార్ ఏమి చేస్తుందని భాజపా ప్రశ్నిస్తోంది. 

వారి విమర్శలకు చేతలతో బదులిచ్చింది. ఎర్రజొన్నలను క్వింటాలుకు రూ.2,300 చొప్పున మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని తెరాస సర్కార్ నిర్ణయించింది. తెరాస ఎంపి కవిత, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు బుధవారం సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం ప్రకటించారు. 

మార్క్ ఫెడ్ ద్వారా నిజామాబాద్ జిల్లాలో పండించిన ఎర్రజొన్నలను మొత్తం ప్రభుత్వమే కొనుగోలుచేస్తుందని చెప్పారు. దీనికోసం అవసరమైన చోట సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పొరుగునే ఉన్న కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పండించిన ఎర్రజొన్నలకు రూ.1,600 మాత్రమే చెల్లిస్తోంది కనుక తెలంగాణా కాంగ్రెస్ నేతలు కర్ణాటక ప్రభుత్వం కూడా క్వింటాలుకు రూ.2,300 చెల్లించాలని ఒత్తిడి చేయగలరా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు ప్రతీ దానిపై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు రైతులను తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.


Related Post