అప్పుడు..ఇప్పుడూ..ఎప్పుడూ..కొరతే!

February 15, 2018


img

కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు, అనేక సమస్యలకు ఏకైక పరిష్కారమని గొప్పగా చెప్పుకొన్న  నోట్లరద్దుతో ఆ సమస్యలేవీ తీరకపోగా నగదు కొరత పట్టిపీడిస్తోంది. నోట్ల రద్దు జరిగి ఏడాదిన్నర అవుతున్నా నేటికీ ప్రజల రోజువారి అవసరాలకు నగదు లభించడం చాలా కష్టంగా ఉంది. నేటికీ అనేక ఎటిఎంలు, ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఎటిఎంలు తెరచుకోలేదు. తెరిచి ఉన్నవాటిలో నగదు ఉండదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో నగదు కొరత చాలా తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నగదు కొరత చాలా తీవ్రంగా ఉందని కనుక తక్షణమే రూ.5,000 కోట్లు నగదు పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి రెండు రోజుల క్రితం ఒక లేఖ వ్రాశారు. ఈరోజు తెరాస ఎంపి వినోద్ కుమార్ కూడా అరుణ్ జైట్లీకు లేఖ వ్రాసారు. తెలంగాణాలో ప్రజలు నగదు కొరత కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని, కనుక తక్షణమే రాష్ట్రానికి నగదు పంపించాలని లేఖలో కోరారు.

ప్రభుత్వాలు ఎప్పుడైనా ఏవైనా సంస్కరణలు చేపట్టినప్పుడు వాటిలో లోటుపాట్ల కారణంగా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవడం సహజం. కానీ నోట్లరద్దు తరువాత అప్పుడు..ఇప్పుడూ..ఎప్పుడూ..దేశంలో నగదు కొరతే కనిపిస్తోంది! చూడబోతే ఇది శాశ్విత సమస్యగా మిగిలిపోయేలా ఉంది. అయినప్పటికీ కేంద్ర ఆర్ధికశాఖకు, దాని మంత్రి అరుణ్ జైట్లీకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సామాన్య ప్రజల కష్టాలు పట్టడం లేదు. ఈ సమస్య కారణంగా ప్రజలలో క్రమంగా అసహనం పెరుగుతోందని ఎవరూ గుర్తించినట్లు లేదు. ప్రజలు సహనం కోల్పోతే అధికార పార్టీలే ఎన్నికల సమయంలో దానికి మూల్యం చెల్లించవలసి వస్తుందని గ్రహిస్తే మంచిది.


Related Post