ఎంపి స్థానానికి పోటీ చేస్తా: కోమటిరెడ్డి

February 13, 2018


img

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నల్లగొండ జిల్లాలో వేములపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో ఉమ్మడి జిల్లాలో అన్ని   స్థానాలను కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకొంటుంది. అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నాము. జిల్లాలో కాంగ్రెస్ ను ఓడించడం సాధ్యం కాదని గ్రహించబట్టే తెరాస హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది. అందుకు తాజా ఉదాహరనే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య. ఇటువంటి హత్యారాజకీయాలకు మేము భయపడము. రాష్ట్రంలో మాపార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేస్తాము. నేను నల్లగొండ ఎంపి స్థానానికి పోటీ చేస్తా,” అని చెప్పారు.

వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎవరికీ టికెట్లు ఖరారు చేయకముందే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ఎంపి స్థానానికి పోటీ చేస్తానని చెప్పుకోవడం విచిత్రమే. అంటే జిల్లాలో ఏ స్థానానికి పోటీ చేయాలో పార్టీ కాకుండా ఆయనే స్వయంగా నిర్ణయించుకొంటారని చెపుతున్నట్లుంది. బహుశః అయన వచ్చే ఎన్నికలలో ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డిని ఓడించి తన సత్తా చాటుకోవాలనుకొంటున్నారేమో? కారణాలు ఏవైనప్పటికీ, పార్టీలో అంతర్గతంగా చర్చించి తీసుకోవలసిన నిర్ణయాలను అయన స్వతంత్రంగా ప్రకటించడం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టించవచ్చు. ప్రత్యర్ధ రాజకీయ పార్టీలకు అది ఆయుధంగా మారవచ్చునని గ్రహిస్తే మంచిది. 


Related Post