ఒకేసారి 20 మంది ఎమ్మెల్యేలపై వేటు!

January 19, 2018


img

అవును. ఒకేసారి 20 మంది ఎమ్మెల్యేలపై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. డిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో 20 మంది ఆమద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగ విరుద్దంగా లాభదాయకమైన పదవులు చేపట్టినందుకు వారిపై అనర్హత వేటు వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. డిల్లీ శాసనసభలో 70 మంది ఎమ్మెల్యేలున్నారు. దాని ప్రకారం మంత్రివర్గంలో ఏడుగురికి మాత్రమే మంత్రులుగా నియమించుకొనే అవకాశం ఉంది. కానీ పార్టీలో అసంతృప్త ఎమ్మెల్యేలను చల్లార్చడం కోసం కేజ్రీవాల్ 21 మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించి వారికి క్యాబినెట్ హోదా కల్పించారు. వారిపై కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన ఖర్చుల బిల్లును రాష్ట్రపతికి పంపగా అయన తిరస్కరించడమే కాకుండా దానిపై తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన ఆ లేఖపై స్పందించిన ఎన్నికల సంఘం వారందరూ చట్ట విరుద్దంగా జోడు పదవులు (ఎమ్మెల్యే, పార్లమెంటరీ కార్యదర్శి) అనుభవిస్తునందున అనర్హులుగా ప్రకటించింది.  

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని భాజపా, కాంగ్రెస్ పార్టీలు స్వాగతించాయి. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినందున దానికి నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ తక్షణమే తన ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేయాలని రెండు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 


Related Post