రాయితీ గొర్రెల ఎగుమతి ఆగేదెప్పుడు?

January 12, 2018


img

రాష్ట్రంలో గొల్ల, కురుమలకు జీవనోపాధి కల్పించి వారి ఆర్ధికస్థితిని మెరుగుపరచాలనే మంచి ఉద్దేశ్యంతో తెలంగాణా ప్రభుత్వం అనేక వ్యయప్రయాసలకోర్చి రాయితీ గొర్రెల పధకం అమలుచేస్తుంటే, వాటి లబ్దిదారులలో కొందరు దానిని దురుపయోగం చేస్తుండటం బాధాకరం. 

మహబూబాబాద్ జిల్లాలో నేరడ గ్రామానికి చెందిన 12 మంది లబ్దిదారులు ప్రభుత్వం నుంచి రాయితీపై లభించిన 210 గొర్రెలను కృష్ణాజిల్లాకు చెందిన బ్రోకర్లకు విక్రయించారు. వాటిని వారు రెండు లారీలలో కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటకు తరలిస్తుండగా వారిని నెల్లికుదురు మండలం బంజర వద్ద జిల్లా పోలీసులు పట్టుకొన్నారు. గొర్రెలను అమ్మిన లబ్దిదారులు, లారీ డ్రైవర్, క్లీనర్లపై కేసులు నమోదు చేశారు. ఆ గొర్రెలను లబ్దిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి కృష్ణా జిల్లాకు తరలించిన తరువాత, తెలంగాణా పశుసంవర్ధక శాఖ అధికారులు గొర్రెలు కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు వాటినే ఎక్కువ ధరకు అమ్ముతుంటారని తెలుస్తోంది.

ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా పర్యటనకు వచ్చినపుడు దీని గురించే మాట్లాడి, ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని వినియోగించుకొని గొల్ల,కురుమలు ఆర్ధికంగా బలపడాలని కొరుకొంటున్నానని అన్నారు. కానీ కొందరు లబ్దిదారులు ఈవిధంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆవిధంగా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా ఈ తంతు కొనసాగుతూనే ఉండటం బాధాకరం. కనుక గొల్ల,కురుమ పెద్దలే చొరవ తీసుకొని లబ్దిదారులకు నచ్చజెప్పాలి. అలాగే గొర్రెల కొనుగోలుకు పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా బ్రోకర్లు వచ్చినట్లయితే, తక్షణమే గ్రామ పెద్దలకు లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేస్తుంటే, ఇటువంటి పనులు చేయడానికి ఎవరో సాహసించరు. ప్రజల సహకారం లేనిదే ఎంత గొప్ప పధకం అయినా విజయవంతం కాదని అందరూ గ్రహించాలి. అయినా ఇది వారి జీవితాలలో వెలుగులు నింపుకోవడానికే తప్ప ప్రభుత్వం కోసం అమలుచేస్తున్నది కాడని గ్రహించాలి. ప్రభుత్వం కూడా స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయితీల ద్వారా లబ్దిదారులను ‘ఎడ్యుకేట్’ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేయడం మంచిది.


Related Post