మొదట్లో కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్.. ఆ తర్వాత గంభీరమైన కథలు, పాత్రలతో తనలోని నటుడుని అవిష్కరించుకున్నారు. ఇప్పుడు భక్తి ప్రధానమైన కథతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కనకదుర్గ’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను చిత్రబృందం నేడు విడుదల చేసింది.
నవరాత్రుల సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్లో అల్లరి నరేష్ కాషాయ రంగు దుస్తులు ధరించి, భక్తిపారవశ్యంతో నృత్యం చేస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇది భక్తి ప్రధానమైన సినిమా అయినప్పటికీ, నరేష్ మార్క్ డైలాగులు, యాక్షన్, కామెడీ వంటివన్నీ ఉంటాయని చిత్రబృందం వెల్లడించింది.
‘ప్రతి ప్రార్థనలోనూ ఒక శక్తి ఉంటుంది’ అనే సందేశంతో అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ ‘కనకదుర్గ’ చిత్రాన్ని పరిచయం చేస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి తొలి పాటను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో అల్లరి నరేష్, కాజల్ చౌదరి జంటగా చేస్తున్నారు.
బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు కథ: బి.వి.ఎస్. రవి, సంగీతం: తమన్ చేస్తున్నారు.
కామెడీ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నరేష్.. ఈ భక్తి ప్రధానమైన చిత్రంతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.