ట్యాంక్‌బండ్‌పై ఘనంగా బతుకమ్మ సంబురాలు.. భారీ ఏర్పాట్లు

October 17, 2026
img

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రేపు (అదివారం) సద్దుల బతుకమ్మ వేడుకలు, నిమజ్జనాలతో ముగియనుంది. 

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. 

నగరంలో ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా, భద్రత, ఇతర అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు.

వేలాది మంది మహిళలు, కళాకారులు, ప్రజలు పాల్గొననున్న ఈ వేడుకలకు తెలంగాణ గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ప్రముఖ సినీనటుడు విజయ్‌ దేవరకొండతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

వేడుకల నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నారు. కార్యక్రమ నిర్వహణ కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళా బృందాలు, కళాకారులు తరలివస్తున్నారు. వారి సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.

ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బంది సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Post