పతంగి టోల్ ప్లాజా వద్ద ఎప్పుడూ ఇంతేనా?

October 17, 2026
img

దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులతో ప్రయాణిస్తున్నవారు ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.

టోల్‌ ప్లాజా వద్ద ఒక్కో వాహనం టోల్‌ గేటు దాటేందుకు అర నిమిషమే పడుతుందని అనుకున్నా.. 60 వాహనాలు గేటు దాటడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. మరి వేల సంఖ్యలో వాహనాలు క్యూలో ఉంటే అవన్నీ టోల్‌ ప్లాజాను దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఈ లెక్కన చూస్తే సమస్య తీవ్రత అర్థమవుతుంది.

దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల కోసం డజన్ల కొద్దీ ప్రత్యేక రైళ్లు, సుమారు 7 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నా రద్దీ మాత్రం తగ్గడం లేదు.

రైళ్లు, బస్సులు కిటకిటలాడుతుండటంతో టికెట్లు, సీట్లు దొరకడం కష్టంగా మారింది. దీంతో సొంత వాహనాల్లో హాయిగా ప్రయాణించవచ్చని భావించినవారు సైతం టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు.

ఈ సమస్య ఏటా పండుగల సమయంలో ఎదురవుతున్నా శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. పండుగల రద్దీని ముందుగానే అంచనా వేసి, టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రాకపోకలు వేగంగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, ప్రయాణికులకు ఈ ఇబ్బందులు లేకుండా చూడాలి.

Related Post