రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా చేసిన ‘రణబాలి’ ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక హైదరాబాద్లో నిన్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన సినిమాలు ఫ్లాప్ అవ్వాలని కోరుకునేవారికి, తనను ట్రోల్ చేసేవారికి అంటూ చేసిన వ్యాఖ్యలు వాటి వలన ఆయనకు కలిగిన బాధకు అద్దం పడుతున్నాయి.
తాను నటించిన ‘నోటా’ ఫెయిల్ అయిన తర్వాత ‘టాక్సీ డ్రైవర్’ రిలీజ్ అవుతున్నప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితే చూశాను. నేను అప్పుడే చెప్పాను నన్ను వేసుకుంటున్న వాళ్ళందరికీ సరైన జవాబు చెప్తానని.. అంటూ నాడు వేదికపై మాట్లాడిన ఆ వీడియో క్లిప్ నిన్న ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రదర్శించారు. ఆ వీడియో క్లిప్ తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఇప్పుడు రణబాలితో వస్తున్నా. అందరికీ జవాబు చెప్పబోతున్నా. మేము అనుకున్నట్లు జరిగితే అనంతపురంలో సభ పెట్టి మీసం మెలేసి జవాబు చెప్తా,”అని అన్నారు.
రణబాలి సినిమాపై ఇంత నమ్మకం ఉండటం మంచిదే. కనుక సినిమా సూపర్ హిట్ అయితే అప్పుడు వేదికపై నిలబడి మీసం మెలేసి ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు.
కానీ సినిమాని దెబ్బ తీయాలనుకునేవాళ్ళు చాలా మందే ఉన్నారని తెలిసి ఉన్నప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఈవిధంగా సవాళ్ళు, శపదాలు చేసి అవతలివాళ్ళను రెచ్చగొడితే రణబాలిని వదిలిపెడతారా? అప్పుడు సినిమా తేడా కొడితే వాళ్ళు ఈ వీడియోని కూడా వేసి మళ్ళీ విజయ్తోనే ఆడుకుంటారు కదా?
రాయలసీమలో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ జరిగిన స్వాతంత్ర్య పోరాటాలతో నేపధ్యంతో ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.
గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి నిర్మిస్తున్న రణబాలి అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.