ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి

August 05, 2026


img

ప్రముఖ సినీ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

ప్రదీప్ రావత్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఒరియా, మరాఠీ, భోజ్‌పురీ, ఇంగ్లీషు భాషలలో తీసిన అనేక సినిమాలలో నటించారు. 

మొదట ధిల్లీలో బ్యాంక్ ఉద్యోగిగా పని చేసిన అయన, ముంబయి బదిలీ అయిన తర్వాత మరాఠీ నాటకాలలో నటించారు. అప్పుడు బాలీవుడ్ నటి స్మితా పాటిల్ ఆయనని ప్రముఖ నిర్మాత రవి చోప్రాకు పరిచయం చేశారు. అయన తీసిన మహా భారత్ హిందీ టీవీ సీరియల్లో అశ్వథామ పాత్ర ఇవ్వగా ప్రదీప్ రావత్ అద్భుతంగా నటించి మెప్పించారు. 

ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ ‘అగ్నిపథ్’ సినిమాలో అవకాశం లభించడంతో ఇక వెనుతిరిగి చూసుకోలేదు.

ఆ తర్వాత అమీర్ ఖాన్ సినిమా ‘లగాన్’లో ప్రదీప్ రావత్ నటన చూసి దర్శకుడు రాజమౌళి ‘సై’ సినిమాలో అవకాశం ఇవ్వడంతో టాలీవుడ్‌లో ప్రవేశించారు. ఆ సినిమాలో ‘భిక్షూ యాదవ్’గా ప్రదీప్ రావత్ అందరినీ మెప్పించి నంది అవార్డు అందుకున్నారు. 

ఆ తర్వాత తెలుగులో భద్ర, దేశముదురు, ఛత్రపతి, లక్ష్మీ, స్టాలిన్, యోగి, జగడం, మస్కా, ఓయ్, రెబల్, నాయక్, గజినీ వంటి అనేక సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రదీప్ రావత్ చివరిగా చేసిన సినిమా గాయపడ్డ సింహం. 

తెలుగు సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆయనకు కాకినాడకు చెందిన కల్యాణితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్ళి చేసుకున్నారు. వారికి విక్రమాదిత్య అనే ఓ కుమారుడు ఉన్నాడు. 

ప్రదీప్ రావత్ మృతి పట్ల టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.  


Related Post

సినిమా స‌మీక్ష