నారా రోహిత్ ఒకేసారి మూడు విభిన్నమైన సినిమాలలో నటిస్తున్నారు. వెంకటేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆదర్శ కుటుంబంలో పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్నారు.
ఇటీవల అయన పుట్టిన రోజున రామ్ గన్ని దర్శకత్వంలో ‘కపాలి’ అనే ఓ అంతుపట్టని తాంత్రిక ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
అదేరోజున చినిమిల్లి మణికుమార్ దర్శకత్వంలో ‘సౌండ్ ఇంజనీర్’ అంటూ ఓ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో విడుదల చేశారు. దీనిలో నారా రోహిత్ వినికిడి లోపం ఉన్నవాడిగా నటించబోతున్నారు.
ఈ సౌండ్ ఇంజనీర్‌కి జోడీగా నయన్ సారిక నటించబోతుండగా, నరేష్, రోహిణి, సంపత్, అజయ్, వెన్నెల కిషోర్, సుదర్శన్, బ్రహ్మాజీ, రఘు కరుమంచి తదితరులు ముఖ్యపాత్రలు చేయబోతున్నారు.
కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీలత చెరుకూరి సమర్పణలో భరత్ చౌదరి నిర్మిస్తున్న సౌండ్ ఇంజనీర్‌కు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చినిమిల్లి మణికుమార్; సంగీతం: యువన్ శంకర్ రాజా; కెమెరా: వెంకట్ సి దిలీప్; ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్ చేస్తున్నారు.