బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసునమోదయ్యింది. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. రేగా కాంతారావు యూట్యూబ్ ఛానల్ పేరుతో తనను ఓ ఫ్లాట్‌కు పిలిపించి, పెళ్ళి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించారు. అనంతరం తన వ్యక్తిగత ఫొటోలను చూపించి బ్లాక్‌మెయిల్ కూడా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 26న పంజాగుట్ట పోలీసులు న్యాయ సంహితలో సెక్షన్ 69, సెక్షన్ 351 (2) కింద రేగా కాంతారావుపై కేసు నమోదు చేశారు. ఆమె చెప్పిన వివరాలు, సమర్పించిన సాక్ష్యాధారాలతో రేగా కాంతారావుకి విచారణకు హాజరు కావాలంటూ నోటీస్ పంపినట్లు తెలుస్తోంది.
అయితే ఆయన వెంటనే హైకోర్టుని ఆశ్రయించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని పేర్కొంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.