తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు హైడ్రా కమీషనర్ ఎవి. రంగనాథ్ ని ఆ పదవిలో నుంచి తక్షణం తొలగించాలని ఆదేశించినప్పటికీ, తమ ఆదేశాన్ని ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఆ పదవిలో ఆయననే కొనసాగిస్తునందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుని ఆదేశించింది.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా లోతుకుంట గ్రామంలో 40 ఎకరాల వివాదాస్పద భూమి విషయంలో యధాతధ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. హైడ్రా తరపున కౌన్సిల్ అందుకు అంగీకరించి కోర్టుకి లిఖితపూర్వకంగా హామీ కూడా ఇచ్చింది. కానీ ఆ తర్వాత హైడ్రా అధికారులు ఎవరికీ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా భారీగా పోలీసులు, సిబ్బందిని వెంటపెట్టుకొని వెళ్ళి జేసీబీలతో అక్కడ ‘శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు చెందిన తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశారు.
అప్పుడు ఆ సంస్థ ఈవిషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాగా హైడ్రా కమీషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిగిన పొరపాటుకి ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ, హైకోర్టు మళ్ళీ జోక్యం చేసుకున్నాక క్షమాపణలు చెప్పడం తప్పించుకునే ప్రయత్నంగానే చూస్తామని స్పష్టం చేసింది.
హైడ్రా చట్టానికి అతీతమనుకుంటే కుదరదని స్పష్టం చేసింది. సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చినప్పటికీ రంగనాథ్ తొలగింపు విషయంలో ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేడు మరోసారి గుర్తు చేసింది.