ఇలా కూడా మోసం చేస్తారా?మోసపోతారా?

July 31, 2026
img

ఇప్పుడు ప్రతీరోజూ కొత్త రకం మోసాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రజలు నష్టపోతూనే ఉన్నారు. అయితే నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీలో జరిగిన ఈ మోసం గురించి విన్నప్పుడు ఇలా కూడా మోసం చేస్తారా?జనం ఇలా కూడా మోసపోతారా?అనిపించక మానదు. 

 హమాల్వాడీకి చెందిన రమేష్ వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తి రూ.1.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. కనుక ఆ అప్పు తీర్చమని రమేష్ ఒత్తిడి చేస్తుంటే, అది తీర్చకుండా అతని వద్ద నుంచే మరో రూ.32,000 కూడా తీసుకున్నాడు. ఎలా అంటే, తనకు గుప్తనిధులు దొరికాయంటూ మట్టి కుండలో బంగారు రాళ్ళని చూపాడు. వాటిని బాకీ కింద జమ చేసుకోవాలని చెప్పడంతో రమేష్ అందుకు ఒప్పుకున్నాడు. 

కానీ వాటిని బజారులో అమ్మితే  చాలా డబ్బు వస్తుంది కనుక తనకు మరో రూ.32,000 ఇవ్వాలని శ్రీనివాస్ అడిగాడు. అందుకు రమేష్ ఒప్పుకొని అతనికి ఆ డబ్బు ముట్టజెప్పి ఆ బంగారు రాళ్ళని తీసుకున్నాడు. కానీ అనుమానం వచ్చి కంసాలి వద్దకు తీసుకువెళ్ళి పరీక్ష చేయించగా అవి బంగారం రంగు పూసిన కంకర రాళ్ళని తేలింది. అప్పుడు గానీ తాను మోసపోయానని రమేష్‌కి అర్థం కాలేదు. వెంటనే డిచ్ పల్లి పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు శ్రీనివాస్ మీద కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. 

Related Post