ఫార్ములా ఈ (ఎఫ్-1) రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో దాఖలైన చార్జిషీట్‌ను పరిశీలించిన కోర్టు, కేటీఆర్‌తో పాటు ఇతర నిందితులకు సమన్లు జారీ చేసి, అందరూ జూలై 31న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
కేసీఆర్ హయంలో కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు నిర్వహణలో హెచ్‌ఎండీఏ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు పలువురు అధికారులు కూడా నిందితులుగా ఉన్నారు.
అయితే ఇదొక లొట్టిపిట్ట కేసు... ఆర్ధిక నేరం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోతున్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపుకే ఈ అక్రమ కేసు నమోదు చేశారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాదిస్తున్న సంగతి తెలిసిందే.
కనుక శుక్రవారం నిందితుల హాజరు అనంతరం, న్యాయస్థానం ఈ కేసు విచారణని వాయిదా వేస్తుందా లేక ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా?అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.