మాధవ్ రెడ్డి దర్శకత్వంలో ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా చేసిన ‘సుయోధన’ మార్చి 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై దర్శక నిర్మాతలు చాలా నమ్మకం పెట్టుకొని హిందీతో సహా 5 భాషల్లో విడుదల చేశారు.
కానీ థియేటర్లలోకి ఎప్పుడు వచ్చిందో... ఎప్పుడు వెళ్ళిపోయిందో అనట్లు అప్పుడే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ రెండు ఓటీటీలలో ప్రసారం అవుతుంది.
ఈ సినిమాలో ప్రియదర్శికి జంటగా ద్రిషిక చందర్ నటించగా సాయి కుమార్, ప్రేమ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. సౌండ్ ఇంజనీరుగా పనిచేసే వరుణ్ (ప్రియదర్శి)కి బాల్యం నుంచి దుర్యోధనుడుని చూసినట్లు ఫీల్ అవుతుంటాడు. అతని తండ్రి ప్రకాష్ (సాయి కుమార్) నాటకాలలో దుర్యోధనుడుగా నటిస్తుండేవారు.
అప్పటి నుంచే దుర్యోధనుడంటే లోలోన భయం ఏర్పడి మానసిక రుగ్మతగా మారినట్లు తెలుసుకుంటారు. అప్పటి నుంచి కొడుకు కోసం ప్రకాష్ నాటకాలు మానేస్తారు. ఆ తర్వాత వరుణ్ ఓ స్టూడియో పెట్టుకొని సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు.
ఓ రోజు సమిత (ద్రిషిక చందర్) అతని సాయంతో ఓ డెమో ఫిల్మ్ షూటింగ్ చేస్తున్నప్పుడు దానిలో ఓ పాత్ర మళ్ళీ సుయోధనుడుగా అనిపిస్తుంది వరుణ్‌కి. తర్వాత ఏం జరిగిందనేది ఓటీటీలో సినిమా చూసి తెలుసుకోవాలి.