తేజ సజ్జ-ప్రశాంత్ వర్మలకు అటు సినీ పరిశ్రమలో, ఇటు ప్రేక్షకులలో మంచి గుర్తింపునిచ్చింది ‘జాంబీ రెడ్డి’. ఈ జోనర్‌లో అనేక విదేశీ సినిమాలు ఉన్నప్పటికీ తెలుగులో రావడం ఇదే మొదటిసారి. కనుక ‘జాంబీ రెడ్డి’తో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
జాంబీ రెడ్డి 2021లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అంటే సుమారు 5 ఏళ్ళ క్రితం. దానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పి చాలా కాలమే అయ్యింది. కానీ తేజ సజ్జ-ప్రశాంత్ వర్మ ఇద్దరూ బిజీ అయిపోవడంతో జాంబీ రెడ్డి సీక్వెల్ ఆలోచన తెరకెక్కించలేకపోయారు.
అయితే ఇటీవలే దాని సీక్వెల్‌కు స్క్రిప్ట్ రెడీ చేశానని ప్రశాంత్ వర్మ చెప్పారు. కానీ సీక్వెల్ వేరే దర్శకుడు చేస్తారని ప్రశాంత్ వర్మ చెప్పారు. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తారని తెలిపారు.
నాడు జాంబీ రెడ్డి తీసేనాటి కంటే ఇప్పుడు అత్యద్భుతమైన టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది కనుక సీక్వెల్ మరింత అద్భుతంగా ఉండబోతోందని ప్రశాంత్ వర్మ చెప్పారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.