జన నాయకుడికి సెన్సార్ బోర్డ్ షాక్!

January 07, 2026


img

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి నటించిన జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అప్పుడే అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది కూడా. కానీ జన నాయకుడుకి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో పెద్ద షాక్ ఇచ్చింది.

దీంతో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టులో అత్యవసర విచారణ జరపాలని కోరుతూ పిటిషన్ వేసింది. తాము మూడు వారాల క్రితమే సెన్సార్ బోర్డుకి సినిమా కాపీ సమర్పించామని, బోర్డు సూచనల మేరకు కొన్ని సన్నివేశాలు, డైలాగులు తొలగించామని కోర్టుకి తెలియజేశారు.

అయినప్పటికీ బోర్డు సభ్యులలో ఒకరు అభ్యంతరం తెలిపారని చెపుతూ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా తొక్కి పెట్టి ఉంచారని నిర్మాణ సంస్థ తరపు న్యాయవాది పరాశరన్ హైకోర్టుకి తెలిపారు. సెన్సార్ బోర్డు ఉద్దేశ్యపూర్వకంగా సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తే నిర్మాణ సంస్థ భారీగా నష్టపోతుందని తెలిపారు.

కనుక తక్షణమే సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని బోర్డుని ఆదేశించాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసి 9వ తేదీ ఉదయం ప్రకటిస్తామని న్యాయమూర్తి తెలిపారు. కనుక జనవరి 9న జన నాయకుడు విడుదల కష్టమే.


Related Post

సినిమా స‌మీక్ష