ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ శుక్రవారం, చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సోమవారం విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు బారీ బడ్జెట్‌తో నిర్మించినవే. కనుక మొదటి వారం పది రోజులు టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు, ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి కోరుతూ తెలంగాణ హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నాయి.
అయితే టికెట్ ఛార్జీల పెంచరాదంటూ ఇదివరకు హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చినందున తెలంగాణ ప్రభుత్వం వాటి అభ్యర్ధనపై స్పందించలేదు. కనుక ఈ రెండు సినిమాల నిర్మాతలు నిన్న (మంగళవారం) హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు.
సింగిల్ జడ్జ్ తీర్పుని కొట్టివేసి, తమ దరఖాస్తులపై స్పందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరారు. సినిమాల విడుదల తేదీ దగ్గర పడుతున్నందున అత్యవసరంగా తమ పిటిషన్లపై విచారణ చేపట్టాలని వారు అభ్యర్ధించారు. కానీ వారి పిటిషన్లపై నేడు (బుధవారం) విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ రెండు సినిమాలు ముందు రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్ వేస్తారు. మర్నాడు తెల్లవారుజామున 4-5 గంటలకు ప్రత్యేక షో వేసుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నాయి. కనుక హైకోర్టు తీర్పుని బట్టి తెలంగాణ ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.