కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి మేరకు ఆమె రాజీనామాని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు మండలి కార్యదర్శి వి. నరసింహాచార్యులు ప్రకటన జారీ చేశారు.
ఆమె 2021 డిసెంబర్‌లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2024 ఏప్రిల్ 27న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహణపై కొన్ని విమర్శలు చేస్తూ కేసీఆర్‌కి ఓ లేఖ వ్రాశారు.
ఆమె అమెరికా వెళ్ళినప్పుడు ఆ లేఖ మీడియాకు లీక్ అయ్యింది. ఆమె తిరిగి రాగానే పార్టీలో హరీష్ రావు వంటి కొందరు తన తండ్రిని తప్పుదారి పట్టిస్తున్నారని, వారే తన లేఖని మీడియాకు లీక్ చేశారని ఆరోపించారు. అప్పటి నుంచే ఆమెకు పార్టీకి మద్య దూరం పెరుగుతూ వచ్చింది.
ఆ తర్వాత ఆమె మళ్ళీ హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేయడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. వెంటనే ఆమె పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
కానీ ఆమె భావోద్వేగంతో రాజీనామా చేశారని భావించిన మండలి చైర్మన్ దానిని ఆమోదించకుండా పక్కన పెట్టారు. కానీ ఆమె మొన్న మండలి సమావేశానికి హాజరయ్యి తాను బాగా ఆలోచించుకునే రాజీనామా చేశానని, కనుక దానిని ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఆమె స్వయంగా సభకు వచ్చి కోరడంతో చైర్మన్ వెంటనే ఆమె రాజీనామాని ఆమోదించారు. కనుక ఇక ఆమె స్వేచ్చగా రాజకీయాలు చేసుకోవచ్చు.