ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మర్నాడు అంటే ఫిబ్రవరి 1వ తేదీన 2026-2027 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది మోడీ ప్రభుత్వం.
తాజా సమాచారం ప్రకారం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకి కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది కూడా. ఒకవేళ ఈ బిల్లు ప్రవేశపెడితే, వివిధ సంవత్సరాలలో విడతల వారీగా జరిగే ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023లో లోక్ సభ ఎన్నికలు 2024లో జరుగగా, ఏపీలో రెండూ ఒకేసారి 2024లో జరిగాయి.
యూపీ, బిహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల ఎన్నికలు వేర్వేరు సమయాలలో జరిగాయి. వీటితోపాటు గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ ఎన్నికలు అన్నీ కూడా ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చాలా సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. కనుక వీటన్నిటినీ ఒకేసారి ఏవిదంగా నిర్వహించబోతోందనేది చాలా ఆసక్తికరం.