ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? లేదు కదా? ప్రముఖ తెలుగు సినీ పరిశ్రమ నటుడు జగపతి బాబు. అవును జగపతిబాబే!
బుచ్చిబాబు- రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో విలన్ అప్పల సూరిగా జగపతి బాబు నటిస్తున్నారు. అయన ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదల చేశారు. ఆయన జగపతి బాబు అని చెప్పకపోయి ఉంటే అతనిని గుర్తుపట్టడం చాలా కష్టమే. కానీ చెప్పేశారు కనుక అందరూ అయన మోహంలో జగపతి బాబు పోలికలు వెతుక్కుని అవును ఆయనే అని నిర్ధారించుకుంటున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బొమ్మన్ ఇరానీ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఫోటోని కెమెరా మ్యాన్ రత్నవేలు విడుదల చేశారు. ఆయన చాలా నీటుగా బట్టలు ధరించి ఆఫీసరులా ఉన్నారు. బహుశః క్రికెట్ సెలక్షన్ టీమ్ లేదా క్రికెట్ బోర్డు చైర్మన్ లేదా సభ్యుడుగా నటిస్తుండవచ్చు.
ఈ సినిమాలో గ్రామీణ క్రికెటర్ పెద్దిగా నటిస్తున్న రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న జాన్వీ కపూర్ పాత్ర పేరు అచ్చియమ్మ. ఆమెని ఇదివరకే పరిచయం చేశారు. ఈ సినిమాలో పెద్ది కోచ్ గౌరు నాయుడుగా ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు.
ఇలా.. ఒక్క షాట్, ఒక్క పాట, ఒక్కో పాత్ర పరిచయంతో దర్శకుడు పెద్దికి చాలా హైప్ సృష్టిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న అభిమానులు సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్న పెద్ది 2026, మార్చి 27న విడుదల కాబోతోంది.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.