కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటున్నారు. ఆయన నటించిన ‘జన నాయగన్’ జనవరి 9న విడుదలవుతోంది. కనుక మొన్న కౌలాంపూర్‌లో ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో విజయ్ దళపతి స్వయంగా సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నేను ఓ చిన్న ఇల్లు కొనుక్కునే అంత సంపాదించుకుంటే చాలనుకొని సినీ పరిశ్రమలోకి ప్రవేశించాను. కానీ నా అభిమానులు నాకు ఏకంగా పెద్ద రాజభవనమే ఇచ్చారు. గత 30 ఏళ్ళుగా నన్ను ఆదరిస్తూనే ఉన్నారు.
ఇన్నేళ్ళుగా నా కోసం పనిచేసిన వారి కోసం నేను కూడా ఓ 30 ఏళ్ళు పనిచేయలనుకుంటున్నాను. అందుకే సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటున్నాను. ఇకపై పూర్తిస్థాయి రాజకీయాలలో పాల్గొంటాను,” అని విజయ్ చెప్పారు.
విజయ్ దళపతి 2009లోనే అభిమానుల సంఘం విజయ్ మక్కల్ ఇయక్కంను ఏర్పాటు చేశారు. దాని ద్వారా అనేక సమాజసేవా కార్యక్రమాలు చేపట్టారు. 2024, ఫిబ్రవరి 2న ‘తమిళ వెట్రి కజగం’ పార్టీని స్థాపించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించగా తొక్కిసలాట జరిగి 40 మంది చనిపోయారు. వారందరి కుటుంబాలను స్వయంగా కలిసి క్షమాపణలు చెప్పుకొని నష్టపరిహారం చెల్లించారు.
జనవరి 9న జన నాయగన్ విడుదలవుతుంది. తర్వాత సంక్రాంతి పండగ హడావుడి ఉంటుంది. కనుక జనవరి నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరిలో విజయ్ తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు జిల్లా పర్యటనలు ప్రారంభించే అవకాశం ఉంది.