నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వైష్ణవాలయాలన్నీ తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం, యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయం, చిలుకూరి బాలాజీ ఆలయం, విశాఖ సింహాచలంలోని శ్రీ వరాహ నరసింహస్వామివారి ఆలయాలలో ఉత్తర ద్వారాలు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాలన్నిటినీ రంగురంగు విద్యుదీపాలతో అందంగా అలంకరించారు.
రెండు రాష్ట్రాలలో చలి విపరీతంగా ఉన్నప్పటికీ భక్తులు ఉత్తర ద్వారదర్శనాల ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు. సిఎం రేవంత్ రెడ్డి దంపతులు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలో నేటి నుంచి పది రోజుల పాటు ఉత్తర ద్వారాలు తెరిచి ఉంచి వాటి గుండా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.