ఇటీవల నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్ బాబా నగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న సూరెడ్డి సుజాత (65) హటాత్తుగా అదృశ్యమయ్యారు. ఆమె ఇంట్లో క్యాబ్ డ్రైవర్ అంజిబాబు (33) అద్దెకుంటున్నాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారంపై అతని కన్ను పడింది.
డిసెంబర్ 19వ తేదీ రాత్రి ఆమె ఇంట్లోకి ప్రవేశించి హత్య చేశాడు. బంగారం తీసుకొని ఓ ఇనుప పెట్లో ఆమె శవాన్ని పెట్టి కోనసీమ జిల్లాలోని సొంతూరు కొత్తపల్లికి చేరుకున్నాడు.
అక్కడ తన స్నేహితులు దుర్గారావు (35), యువరాజు (19)లకు ఈ విషయం చెప్పి వారితో కలిసి హైదరాబాద్ తిరిగివచ్చాడు. తర్వాత వారు ఆమె శవాన్ని కారులో పెట్టుకొని మళ్ళీ కోనసీమ జిల్లాలోని కృష్ణలంకకు చేరుకున్నారు. అక్కడ గోదావరి నదిలో ఆమె శవాన్ని పడేశారు. తర్వాత ముగ్గురూ 11 తులాల బంగారం పంచుకున్నారు.
ఓ మనిషి కనపడకుండా పోతే ఎవరికీ తెలియదనుకోవడం అవివేకమే. మొయినాబాద్‌లో ఉంటున్న సూరెడ్డి సుజాత చెల్లెళ్ళు సువర్ణలత అక్కకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఈ నెల 24న అక్క ఇంటికి వచ్చారు.
కానీ అక్క ఇల్లు, పక్కనే ఉండే అంజిబాబు ఇల్లు కూడా తాళం వేసి ఉంది. వెంటనే నాచారం పోలీసులకు పిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా అంజిబాబు, అతని స్నేహితుల నిర్వాకం బయటపడింది.
మొదట అంజిబాబుని తర్వాత మిగిలిన ఇద్దరినీ పట్టుకున్నారు. పోలీసులు తమ పద్దతిలో విచారించగా నిజం చెప్పేశారు. వారు చెప్పిన ఆధారాలతో కోనసీమ జిల్లా చేరుకొని గోదావరి నదిలో గాలించగా మామిడికుదురు గ్రామం సమీపంలో లభించింది.
బంగారం కోసమే ఆమెను హత్య చేశామని నిందితుడు అంజిబాబు అంగీకరించాడు. దానిలో కొంత ఇస్తామని ఆశ జూపడంతో తాము అతనికి సాయపడదామని మిగిలిన ఇద్దరు ఒప్పుకున్నారు.