హైదరాబాద్ అంతటా అప్పుడే న్యూ ఇయర్ వేడుకలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. నగరంలో గల్లీలు, కాలనీలు మొదలు క్లబ్బులు, పబ్బులు, ఫామ్‌హౌసుల వరకు న్యూ ఇయర్ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వేలాదిమండితో నగరంలో పలు ప్రాంతాలలో భారీగా న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ఎలాగూ తప్పదు. కొన్ని చోట్ల మాదకద్రవ్యాలు సరఫరా అవుతుంటాయి. కనుక హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ బహిరంగ హెచ్చరిక చేశారు. నగరంలో జరిగే న్యూ ఇయర్ వేడుకలలో ఈగల్ టీమ్, పోలీసులు నిఘా ఉంటుందని, కనుక ఎవరూ మాదక ద్రవ్యాలతో పార్టీలు చేసుకోవాలని ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ఎవరైనా మాదక ద్రవ్యాలతో పట్టుబడితే నేరుగా జైలుకే పంపించేస్తామని హెచ్చరించారు. ఈ మూడు రోజులు నగరంలో నిఘా పెంచాలని పోలీసులను ఆదేశించారు. ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాలలో న్యూ ఇయర్ వేడుకలలో అనుమానాస్పదంగా అనిపిస్తే తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలని వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఓ పక్క నగరంలో మాదక ద్రవ్యాల వేట కొనసాగుతుంటే మరో పక్క నగరంలో పలు చోట్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు కూడా నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నారు.