రమేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా చేసిన ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఓ అభిమాని తన అభిమాన హీరో డబ్బు లేక సినిమా రిలీజ్ చేసుకోలేకపోతుంటే, అప్పుడా అభిమాని మూడు కోట్లు ఇచ్చి తోడ్పడతాడు. ఈ సినిమా కధ అందరికీ తెలిసిందే.
ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే అంటే నిన్న డిసెంబర్ 5న బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో అఖండ-2 విడుదల కావలసి ఉంది. కానీ ఆర్ధిక లావాదేవీలలో ఫైనాన్సర్‌తో వివాదం ఏర్పడటంతో చివరి నిమిషంలో అఖండ-2 వాయిదా పడింది.
అప్పుడు అందరికీ ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాలో అభిమాని తన హీరోని ఆదుకున్న సన్నివేశం కళ్ళ ముందు మెదలడం సహజం. బాలయ్యకి లక్షలమంది అభిమానులు ఉన్నా ఎవరూ ఆదుకోలేదే? అనిపించడం సహజం.
ముఖ్యంగా ఇటు సినీ పరిశ్రమలో, అటు ఆంధ్రా రాజకీయాలలో అంత శక్తివంతమైన బాలయ్య సినిమా చివరి నిమిషంలో ఆగిపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అఖండ-2 రిలీజ్ చేసుకోలేకపోవడంపై భిన్నాభిప్రాయాలు, విమర్శలు, ప్రశంశలు వినిపిస్తున్నాయి.
అఖండ-2కి ఎదురైన ఈ సమస్యని పరిష్కరించేందుకు పలువురు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. వారిలో ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు కూడా ఒకరు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సురేష్ బాబు చెప్పారు.