ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూప కొడువయూర్ జంటగా చేసిన ‘సారంగపాణి జాతకం’ ఈ నెల 25న విడుదల కాబోతోంది. కనుక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఈ సందర్భంగా తన 9 ఏళ్ళ సినీ ప్రస్థానం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “అంత గొప్పగా ఏమీ లేదు కనుక సంతృప్తిగా లేను కానీ ఖాళీగా లేకుండా సినిమాలు చేస్తున్నాను కదా అని సంతోషపడుతున్నాను. ఇన్నేళ్ళ నా కెరీర్లో కోర్ట్ సినిమా ఒప్పుకోవడమే నేను తీసుకున్న మంచి నిర్ణయమని భావిస్తున్నాను.
అదేవిదంగా మిఠాయి సినిమా చేయడం తప్పుడు నిర్ణయమని తర్వాత అర్దమైంది. అది ఒప్పుకున్నప్పుడే ఎందుకో సరిగ్గా అనిపించలేదు. దర్శకుడు కూడా మనసు పెట్టి తీయలేదు. ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటివి చేయకూడదు? అనే విషయం నాకు బాగా నేర్పింది మిఠాయి సినిమాయే. పొరపాట్లు చేయడం వలన నష్టపోతాము కానీ వాటి నుంచి చాలా విలువైన గుణ పాఠాలు నేర్చుకోగలుగుతాము.
అందరూ నన్ను కామెడీ యాక్టర్‌గానే చూస్తుంటారు. కానీ నేను కామెడీకి పనికి రాననే విషయం నాకు తెలుసు. వెన్నెల కిషోర్, సత్యలా నేను కామెడీ చేయలేను. కానీ కామెడీ సినిమాలు వస్తే చేయక తప్పడం లేదు. ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాస రావుల నటన, స్టైల్ నాకు బాగా నచ్చుతుంది. చేస్తే వారిలా చేయాలనుకుంటాను. కానీ కష్టం,” అని ప్రియదర్శి అన్నారు.
ప్రియదర్శికి తన కెరీర్ పట్ల సంతృప్తిగా లేదని చెపుతున్నాడు కానీ తొమ్మిదేళ్ళ ప్రస్థానంలో పెళ్ళి చూపులు, మల్లేశం, జాతి రత్నాలు, బలగం, 35: చిన్న కధ కాదు, మంగళవారం, కోర్ట్ వంటి సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు సారంగపాణి జాతకం ఎలా ఉంటుందో చూడాలి.