తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు సత్వరమే పరిష్కరించవచ్చు. వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ దురుపయోగం కాకుండా నివారించవచ్చు. ఆ విద్యుత్ వ్యయం లెక్కలు కూడా స్పష్టంగా ఉంటాయి.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని తప్పు పడుతూ అడ్డుకునే ప్రయత్నం చేసే బీఆర్ఎస్ పార్టీ దీనినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ రైతు డిస్కం ప్రతిపాదనని తిరస్కరించాలని హరీష్ రావు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ వ్రాశారు.
ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం హయంలో రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందించేవాళ్ళం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకి 13 గంటలే ఇస్తోంది.
వ్యవసాయానికి సోలార్ విద్యుత్ మాత్రమే ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. కనుక ఉచిత విద్యుత్ రోజుకి 7 గంటలకు తగ్గించేందుకు ఈ కుట్ర చేస్తున్నారనే అనుమానాలున్నాయి. ఈ లెక్కన రేపు సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ కోత విధించే అవకాశం ఉంది.
రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని బడే భాయ్ అంటున్నారు కనుక ఇప్పుడు గుజరాత్ మోడల్ తెలంగాణలోనూ అమలు చేయాలని చూస్తున్నారు. కానీ రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు,” అని హరీష్ రావు హెచ్చరించారు.