తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు నిత్యం బిజేపి, ప్రధాని మోడీపై కత్తులు దూస్తుండేవారు. కానీ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి అధికార కాంగ్రెస్ పార్టీపై కత్తులు దూస్తున్నారు. బిజేపి జోలికి అసలు పోవడం లేదు. ఒకవేళ ఎప్పుడైనా మాట వరుసకు విమర్శించడమే తప్ప ఇదివరకులా హోరాహోరీ యుద్ధాలకు ఇష్టపడటం లేదు. కారణం... వచ్చే ఎన్నికలలో బిజేపితో పొత్తులు పెట్టుకునేందుకేనని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ, “జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నప్పుడు హరీష్ రావు దానిలో పాల్గొనకుండా హడావుడిగా ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఎవరెవరిని కలిశారో ఎందుకు కలిశారో మా వద్ద పూర్తి సమాచారం ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా బయటపెడతాను.
వచ్చే ఎన్నికలలో బిజేపితో పొత్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆరాటపడుతోంది. అందుకే హరీష్ రావు ఢిల్లీ పర్యటనలు. కానీ హరీష్ రావు ఎల్లకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటారనే నమ్మకం లేదు. ఇదివరకు వైఎస్సార్ సిఎంగా ఉన్నప్పుడే ఆయనతో భేటీ అయ్యారు.
కనుక రేపు ఏదో ఒకరోజున పార్టీ మారరనే నమ్మకం ఏమీ లేదు. చివరి వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పగలరా?” అని సిఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుకు సవాలు విసిరారు.