నిజామాబాద్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ప్రకటించడంతో దానిని సాధించిన బీజేపి ఎంపీ ధర్మపురి అర్వింద్‌కి జిల్లాలోని పసుపు రైతులు సన్మానాలు సత్కారాలు చేస్తున్నారు. కానీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాను సాధించలేకపోయిన పసుపు బోర్డుని ఆయన సాధించినందుకు సంతోషించాలి.. అభినందించాలి. కానీ రాష్ట్ర మంత్రికి తెలియకుండా పసుపు బోర్డు ప్రకటించడం రాజకీయమే అని వాదించారు.
ఆనాడు పసుపు బోర్డుకి బదులు కేంద్ర ప్రభుత్వం స్పైసస్ బోర్డు మంజూరు చేసిననట్లు ప్రకటిస్తే ఎంపీ ధర్మపురి అర్వింద్ “తాను ప్రధానిని అంబాసిడర్ కారు అడిగితే బెంజి కారు ఇచ్చారని’ గొప్పలు చెప్పుకున్నారు కదా? మరిప్పుడు బెంజి కారు వెనక్కు తీసుకొని అంబాసిడర్ కారు ఇస్తే దాని కంటే ఇదే గొప్పన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
ఆనాడు ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడిన మాటల రికార్డులన్నీ భద్రంగానే ఉన్నాయని, కనుక ఆయన ఇప్పుడు మాట మార్చినా అవెక్కడికీ పోవని అన్నారు.
ఇంతకీ పసుపు బోర్డు వద్దని కల్వకుంట్ల కవిత అనుకుంటున్నారా?లేదా తనకు దక్కాల్సిన క్రెడిట్ బీజేపి ఎంపీ ధర్మపురి అర్వింద్‌కి దక్కిందని అసూయ పడుతున్నారో అర్దం కాదు.
ఆనాడు ఆయన ఏం మాట్లాడరనేది ముఖ్యం కాదిప్పుడు. నిజామాబాద్ పసుపు రైతులు కోరుకున్నట్లు, వారికి ఇచ్చిన మాట ప్రకారం ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు సాధించుకు వచ్చారనేదే ముఖ్యం... ఎవరైనా కాదనగలరా?