రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న అనేక చర్యల వలన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, దిగుబడి చాలా భారీగా పెరిగింది. అలాగే పళ్ళు, పూవులు, ఉద్యానవన పంటలు, పామాయిల్, పాడి పరిశ్రమ, కోళ్ళు, చేపలు, రొయ్యలు, మాంస ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కనుక వీటన్నిటినీ మరో స్థాయికి తీసుకువెళ్ళి వీటిని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ తదితర రంగాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
కనుక దీని కోసం ఈ నెల 28,29 తేదీలలో హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం “ది ఫుడ్ కాన్‌క్లేవ్” పేరుతో రెండు రోజులు సదస్సు నిర్వహించబోతోంది. ఆయా రంగాలలో అగ్రస్థానాలలో ఉన్న వందకు పైగా పరిశ్రమల అధినేతలు లేదా వారి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకాబోతున్నారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. వారి మద్య రౌండ్ టేబిల్ సమావేశాలు, తెలంగాణతో సహా దేశంలో ఆయా పరిశ్రమల స్థాపనకు గల విస్తృత అవకాశాలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ రెండు రోజుల సదస్సుకి సంబందించి లోగో-పోస్టర్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, ఆ శాఖల కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.