తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ తర్వాత అత్యంత కీలక ఘట్టం ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. వెంటవెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. మధ్యాహ్నం 2-3 గంటల లోపే మున్సిపాలిటీల ఫలితాలపై పూర్తి స్పష్టత వస్తుంది. కార్పోరేషన్ ఫలితాలపై సాయంత్రానికి పూర్తి స్పష్టత వస్తుంది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంచనీయ ఘటనలు జరుగకుండా కౌంటింగ్ కేంద్రాల చుతో నిషేధాజ్ఞలు విధించి భారీగా పోలీసులతో మూడంచెల భద్రత కల్పించారు.
ఆనవాయితీ ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత 25 బ్యాలట్లు ఓ కట్టగా కడతారు. అలా ప్రతీ వార్డు, డివిజన్‌లో పోలైన ఓట్ల కట్టలన్నిటినీ పెద్ద డ్రమ్ములో వేసి కలుపుతారు. ఇలా కట్టలు కట్టే క్రమంలోనే ప్రతీ అభ్యర్ధికి పడిన చెల్లని లేదా నోటా ఓట్లను వేరే చేస్తారు.
ఒక్కో రౌండులో 40 కట్టలు (1,000 బ్యాలట్లు) చొప్పున లెక్కిస్తారు. ఆ తర్వాత ఒక్కో కట్ట నుంచి పార్టీల వారీగా బ్యాలెట్ పత్రాలు విడదీసి, అక్కడే ఉన్న పోలింగ్ ఏజంట్లకు చూపిస్తూ పార్టీల వారీగా ఏర్పాటు చేసిన ట్రేలలో వేస్తారు. అట ప్రతీ వంద బ్యాలెట్ పత్రాలను ఓ కట్టగా కడతారు. వంద కంటే తక్కువ ఉన్నవాటిని వేరేగా కట్ట కట్టి వాటిలో ఎన్ని బ్యాలెట్ పత్రాలున్నాయో స్లిప్ పెట్టి వివరాలు నోట్ చేసుకుంటారు.
ఆ తర్వాత వరుసగా బ్యాలెట్ కట్టలని లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. తర్వాత గెలిచిన అభ్యర్ధులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. గెలిచిన అభ్యర్ధులు ఈ నెల 13న మున్సిపల్ చైర్ పర్సన్స్, డిప్యూటీ చైర్ పర్సన్స్, కార్పోరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోవడంతో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.